లోకేష్‌కు కేశినేని హ్యాండ్..బెజవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ?

మరో రోజులో విజయవాడలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ కానున్న విషయం తెలిసిందే. మంగళగిరిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇస్తారు. మొదట విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. 20వ తేదీన విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లోకి వెళ్తారు. 21వ తేదీన గన్నవరంలో పాదయాత్ర చేసి..అక్కడే భారీ సభ ఏర్పాటు చేస్తారు. 22న హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడుకి వెళ్ళి..అటు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలోకి ఎంట్రీ ఇస్తారు.

ఇలా నాలుగు రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు ప్రతి జిల్లాలో పది రోజులుపైనే లోకేష్ పాదయాత్ర చేశారు. కానీ కృష్ణాలోనే నలుగురు రోజులు చేస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేది..కానీ ఇప్పుడు ఒక్క గన్నవరంలోనే సభ ఏర్పాటు చేస్తున్నారు. అంటే పాదయాత్ర త్వరగా ముగించాలని ఇలా చేస్తున్నారా? లేక కృష్ణాలో తెలుగు తమ్ముళ్ళ మధ్య సమన్వయం లేక ఇలా జరుగుతుందా? అనేది క్లారిటీ లేదు.

అయితే కృష్ణాలో టి‌డి‌పి నేతలు ఎవరికి వారే ఉన్నట్లు ఉన్నారు. పైగా పాదయాత్ర బాధ్యతలని కేశినేని చిన్నికి అప్పగించారు. దీంతో పాదయాత్ర ఏర్పాట్లు ఆయనే చూసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎంపీ కేశినేని నాని కనబడటం లేదు. పైగా మొదట లోకేష్ విజయవాడ వెస్ట్ లోనే పర్యటిస్తారు. వెస్ట్ బాధ్యతలు కేశినేని నాని చూస్తున్నారు. మరి అక్కడ లోకేష్ పాదయాత్ర జరిగేప్పుడు కేశినేని వస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు.

ప్రస్తుతానికి ఆయన టి‌డి‌పిలో కనిపించడం లేదు. ఒకవేళ లోకేష్ పాదయాత్రగా వచ్చినప్పుడు కేశినేని..తన కుమార్తె శ్వేతని రంగంలోకి దింపే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి బెజవాడలో లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుందో లేదో.