ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమేనా….!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలలు గడువుంది. 2019 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగగా… మళ్లీ 2024 ఏప్రిల్ వరకు జగన్ సర్కార్‌కు గడువుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా అప్పుడే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తొలి నుంచి ప్రతిపక్షాలు తమ శ్రేణులను అలర్ట్ చేస్తున్నాయి. అటు అధికార పార్టీ నేతలు సైతం… ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే ప్రకటనలు చేశారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం… ముందస్తు మాటను పదే పదే కొట్టివేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చేశారు. చివరికి పార్టీ నేతలతో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రివ్యూలో కూడా… ఎన్నికలకు ఇంకా 9 నెలలు గడువుంది అని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఢిల్లీ పర్యటన సమయంలో కూడా జమిలీ ఎన్నికలపై కేంద్ర పెద్దలతో చర్చించినట్లు పుకార్లు షికారు చేశాయి. కానీ అవేవి వాస్తవం కాదని తేల్చేశారు వైసీపీ పెద్దలు.

అయితే తాజాగా ఎన్నికల కమీషన్ తీసుకున్న కీలక నిర్ణయం మరోసారి ముందస్తు ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఏపీలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ… ఈసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులను ఈసీ నియమించింది. ముందస్తు పుకార్ల నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలను నియమిస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో ఈసీ వెల్లడించింది. దీని ద్వారా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లైంది.

రాష్ట్రంలో ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో తప్పుల సవరణతో పాటు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కూడా చురుగ్గా సాగుతోంది. ఈ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ నెల వరకు జరగనుంది. కానీ ఇంతలోనే రిటర్నింగ్ అధికారులను నియమించడం చూస్తుంటే… ఎన్నికలకు తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఈసీ ఇస్తోంది. దీనికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో తమ పనిని మొదలుపెట్టనున్నారు. ఓ వైపు విపక్షాలు ఇప్పటికే జోరుగా ప్రజల్లో పర్యటిస్తున్నాయి. మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తుండగా… చంద్రబాబు ప్రాజెక్టుల బాట పేరుతో, పవన్ వారాహి యాత్ర అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు మాటను అధికార పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నా… విపక్షాలు మాత్రం… ముందస్తు ఖాయమనే మాటను బలంగా నమ్ముతున్నాయి.