టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం లేదంటా… మరి ఫీజు…!

జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఇకపై టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం లేదంట… ఇదే మాట ఇప్పుడు కేంద్రం చెబుతోంది. వాస్తవానకి జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. జాతీయ రహదారిపై ప్రతి 60 కిలోమీటర్ల దూరానికి ఒక టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. అక్కడ వాహనాన్ని బట్టి ఫీజు వసూలు చేస్తారు. బైక్, ఆటో, ట్రాక్టర్లకు మినహా… కారు మొదలు… పెద్ద వాహనాల వరకు ఫీజు వసూలు చేస్తారు. గతంలో పూర్తి నగదు రూపంలో వసూలు చేసిన ఈ ఫీజు… ఇప్పుడు ఆన్ లైన్ చేసేశారు. ఫాస్ట్ ట్యాగ్ పేరుతో నగదు రహిత చెల్లింపులకు తెర తీసింది మోదీ సర్కార్. ఫాస్ట్ ట్యాగ్‌లో ముందస్తుగా రీఛార్జ్ చేసుకుంటే… అది టోల్ ప్లాజా దగ్గర స్కానర్ ద్వారా ఆయా ఖాతాల్లోకి జమ అవుతుంది. దీని వల్ల టోల్ ప్లాజాల దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో చిల్లర గొడవలు కూడా ప్రస్తుతం లేవు.

పండుగల సమయంలో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ విపరీతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గంటల తరబడి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వేల రూపాయలు చలానాలు కడుతున్నా కూడా.. ఇంకా ట్రాఫిక్ జామ్ ఏమిటంటూ పలు చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఇప్పుడు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలు చేస్తున్న కేంద్రం… దీనిని మరింత ఆధునీకరించే దిశగా చర్యలు చేపట్టింది. ఫాస్ట్ ట్యాగ్‌లో సైతం కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. స్కానింగ్ సరిగ్గా అవన్ని కారణంగా కొన్నిసార్లు 5 నిమిషాలు పైగానే ఆగాల్సి వస్తోంది. దీనికి బ్రేక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటోంది. టోల్ ప్లాజాలు ఉన్నప్పటికీ… వాటి వద్ద ఇకపై ఆగాల్సిన అవసరం లేకుండానే సాఫీగా ముందుకు సాగిపోయే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది.

టోల్ ప్లాజాల వద్ద శాటిలైట్ వ్యవస్థ, అత్యాధునిక కెమెరాల వినియోగం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. ప్రస్తుతం స్కానింగ్ కోసం నిమిషం వరకు ఆగాల్సి వస్తుందని.. ఈ సమయాన్ని 45 సెకన్ల లోపు కుదించేలా చర్యలు చేపడుతున్నట్లు గడ్కరి తెలిపారు. వాహనం వచ్చిన వెంటనే… దాని నంబర్ ప్లేట్‌ను కెమెరాల ద్వారా స్కాన్ చేసి శాటిలైట్‌కు సమాచారం పంపిస్తారు. దీని వల్ల వాహనం ఆగాల్సిన అవసరం లేదు. పైగా జాతీయ రహదారిపై వాహనం ఎంత దూరం ప్రయాణిస్తే.. అంతే దూరానికి టోల్ ఫీజు వసూలు చేసే విధంగా కొత్త విధానం అమలులోకి తీసుకువస్తున్నట్లు గడ్కరి వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీ – మీరట్ ఎక్స్‌ప్రెస్ వే పైన ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు కూడా గడ్కరి తెలిపారు.