రాజకీయాలకు పుట్టిలుగా విజయవాడకు పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం విజయవాడ పార్లమెంట్ సహా ఏపీ – తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాల గురించి ఎక్కువగానే చర్చ జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అందులో 3 విజయవాడ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఇక రెండు నియోజకవర్గాలు ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉంటాయి. దీంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతూనే ఉంటాయి. తాజాగా విజయవాడ పార్లమెంట్ సహా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు వీరే అనే పుకార్లు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా షికారు చేస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే రెండు పార్టీల అధినేతలు 3 సార్లు భేటీ కావడంతో… ఇదే ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయమంటున్నారు. నాని వ్యవహారం ఇప్పటికే పార్టీకి కొంత ఇబ్బందిగా మారిందనేది బహిరంగ రహస్యం. చివరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప కేశినేని శివనాథ్ (చిన్ని) పోటీ చేయడం దాదాపు ఖాయమే. ఆ దిశగా ఇప్పటికే చిన్ని గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు.
ఇక పార్లమెంట్ పరిధిలో 2019లో టీడీపీ గెలిచిన ఏకైక నియోజకవర్గం విజయవాడ తూర్పు. అక్కడ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మరోసారి పోటీ చేయనున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకే టికెట్ ఖరారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన ఉమా.. ఈ సారి గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పోతిన మహేశ్ పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన పార్టీకి కేటాయించనున్నారు చంద్రబాబు. అక్కడ నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే టీడీపీ తరఫున జలీల్ ఖాన్, ఆయన కుమార్తె పేర్లు పరిశీలించినప్పటికీ… జనసేనకు కేటాయిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్… తాతయ్య పేరు ఖరారు చేశారు చంద్రబాబు. నియోజకవర్గంలో లుకలుకలున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం తాతయ్య వైపే మొగ్గు చూపుతున్నారు. నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్యకు ప్రత్యామ్నాయం లేదు. బట్టి మళ్లీ ఆమె పోటీ చేయడం ఫిక్స్. తిరువూరు నియోజకవర్గం నుంచి దేవదత్తు పేరు దాదాపు ఖాయమే. ఇక చివరగా మైలవరం నియోజకవర్గంలో మాత్రం చంద్రబాబు మార్పు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వరుసగా నాలుగు సార్లు గెలిచిన మాజీ మంత్రి దేవినేని ఉమా… 2019లో మాత్రం అనూహ్యంగా ఓడిపోయారు. ఈసారి ఆయనకే టికెట్ అనే ప్రచారం జరుగుతున్నప్పటికీ… అది అసాధ్యమనే మాటే వినిపిస్తోంది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమంటున్నారు. ఎన్నికల ముందు ఏ క్షణమైనా ఆయన టీడీపీలో చేరుతారనే వసంత వర్గం మాట. వసంత పార్టీలో చేరిన మరుక్షణమే ఆయనను మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించనున్నారు. దేవినేని ఉమను మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పెనమలూరు నియోజకవర్గానికి పంపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల్లో మినహా.. మిగిలిన చోట్ల మాత్రం.. పెద్దగా మార్పులు లేవనేది ప్రస్తుతం పార్టీలో వినిపిస్తున్న మాట.