బాబు నోట… పదే పదే అదే మాట… వారే టార్గెట్…!

చంద్రబాబు నాయుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మాట ఒకటే… తమ్ముళ్లు… హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను… ఈ సెల్‌ఫోన్ నేనే తీసుకువచ్చాను… ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ… అధికారంలో ఉన్నప్పుడు… ఆ తర్వాత కూడా చంద్రబాబు ఇదే మాట పదే పదే చెప్పుకొచ్చారు. ఒకదశలో టీడీపీ అభిమానులు… ఇంకా ఎంతకాలం ఇలా చెప్తారు సార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇక ప్రతిపక్ష నేతలైతే… హైదరాబాద్ అంతకు ముందు లేదా.. అంటూ సూటిగా ప్రశ్నించారు కూడా. దీంతో ఆ మాటలను నెమ్మదిగా పక్కన పెట్టారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్లు అదే పాట పాడిన చంద్రబాబు… తర్వాత… ఏపీకి కియా కార్ల కంపెనీని నేనే తీసుకువచ్చా.. అని చెబుతున్నారు. దాని వల్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని గొప్పగా చెప్పుకుంటున్నారు.

అయితే గత నెల రోజులుగా బాబు నోటి నుంచి కొత్త మాటలు పదే పదే వస్తున్నాయి. అవే మన నాయకుడు ఎన్టీఆర్ అనే మాట. వాస్తవానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ పేరు చంద్రబాబు పలికింది చాలా తక్కువ. చాలా వరకు ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలప్పుడు, మహానాడు వంటి వేదికలపై తప్ప.. ఎన్టీఆర్ పేరును చాలా తక్కువగానే చంద్రబాబు పలికేవారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిపోయింది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు… ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పదే పదే ఎన్టీఆర్ పేరు పలుకుతూ… టీడీపీ కార్యకర్తలను, ఎన్టీఆర్ అభిమానులను ఉత్తేజ పరుస్తున్నారు.

ప్రాజెక్టుల బాట పేరుతో చంద్రబాబు చేపట్టిన యాత్ర… రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ యాత్రకు ముందు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రాజెక్టులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. పదేపదే ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు చంద్రబాబు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన దాత ఎన్టీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగుగంగ ద్వారా రాయలసీమలో నీరు పారించారని… దానిని తాను కూడా కొనసాగించినట్లు చెప్పారు. యాత్రలో సైతం తెలుగుగంగ, ఎన్టీఆర్ అనే పేర్లను పలుసార్లు ప్రస్తావించారు. ఇక కదిరి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో అయితే… ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్.. అని… షర్మిళకు ఆస్తిలో వాట ఇవ్వకుండా జగన్ తరిమికొట్టాడని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులను దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు పదే పదే ఆయన పేరును ప్రస్తావిస్తున్నారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.