బీఆర్ఎస్ లిస్ట్‌లో ట్విస్ట్‌లు..కేసీఆర్ టార్గెట్ 95..బీఆర్ఎస్‌కు సాధ్యమేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు 100 రోజుల వరకు సమయం ఉందనే చెప్పవచ్చు. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు..కానీ ఈలోపే కే‌సి‌ఆర్ దూకుడు ప్రదర్శించారు. 115 మందితో అభ్యర్ధుల లిస్ట్ విడుదల చేశారు. 119 సీట్లు ఉంటే 115 సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్ల విషయం ఇంకా తేల్చలేదు.

ఇక ఏడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చారు. ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్, స్టేషన్ ఘనపూర్, వైరా, ఉప్పల్, వేములవాడ నియోజకవర్గాల్లో సిట్టింగులని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. కే‌సి‌ఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. దీంతో కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైడ్ అయ్యారు. ఇక కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ తప్పుకుని తన తనయుడు సంజయ్‌కు సీటు ఇప్పించుకున్నారు. అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో..ఆయన కుమార్తె లాస్యకు ఛాన్స్ ఇచ్చారు.

ఇలా 10 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్ధులు వచ్చారు. అటు కాంగ్రెస్, ఎం‌ఐ‌ఎం, బి‌జే‌పి సిట్టింగ్ సీట్లలో కూడా బలమైన బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అటు కాంగ్రెస్, టి‌డి‌పిల నుంచి గత ఎన్నికల్లో గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేశారు. దీంతో ఆయా స్థానాల్లో ఉన్న బి‌ఆర్‌ఎస్ నేతలు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్న.

తాజాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు..హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మైనంపల్లిని బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు సీటు ఫిక్స్ చేశారు. ఇప్పుడు మల్కాజిగిరి అసెంబ్లీలో మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అభ్యర్ధులని ప్రకటించి దూకుడుగా ఉన్న కే‌సి‌ఆర్..ఈ సారి 95-105 సీట్లని గెలుస్తామని అన్నారు. మరి ఆ టార్గెట్ రీచ్ అవ్వడం అంత తేలికగా కనిపించడం లేదు. చూడాలి మరి బి‌ఆర్‌ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో.