టీడీపీలో యువ నేతలు… రంగంలోకి వారసులు…!

ఒకసారి రాజకీయాల్లోకి వస్తే చాలు… ఇక వారి తరతరాలు ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంటారు. తాతల కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబాలు ఏపీలో చాలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారి వారసులను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో రెండు ప్రధాన పార్టీల్లో కూడా వారసుల రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీలో తొలి తరం నేతలు ఇప్పుడు వారి వారసులను ప్రజా క్షేత్రంలో దింపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒకరిద్దరు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కూడా. అటు వైసీపీలో కూడా వారసుల కోసం సీనియర్లు భారీ ప్లాన్‌లు వేస్తున్నారు. ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసులకు అవకాశం ఇవ్వాలని అధినేతల చుట్టూ తిరుగుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో వారసుల హవా ఇప్పటికే మొదలైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచారు. ఇక పలాస నియోజకవర్గం నుంచి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె శిరీష పోటీ చేసి ఓడారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ పోటీకి సై అంటున్నారు. విజయనగరం జిల్లాలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ, కాకినాడ నుంచి ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక తుని నియోజకవర్గంలో అయితే యనమల రామకృష్ణుడు తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని అధినేతను అడిగారు కూడా. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తన తమ్ముడి కుమారుడు రవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

వీరితో పాటు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, గాలి భాను ప్రకాశ్, బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. అలాగే కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబం, అనంతపురం జిల్లాలో జేసీ సోదరులు కూడా వారసులను తెరపైకి తీసుకువచ్చారు. వీరంతా రాబోయే ఎన్నికల్లో గెలిచి… చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆరాటపడుతున్నారు.