పశ్చిమ ప్రకాశంపైనే టీడీపీ ఫోకస్… కారణం…!?

తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఒకటే… అది రాబోయే ఎన్నికల్లో గెలుపు. ఇందుకోసం ఇప్పటి నుంచే అవకాశం ఉన్న అన్ని మార్గాలను వాడేస్తున్నారు. ఏడాది ముందే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారు. దీనితో పాటు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు టీడీపీకి ఎదురు దెబ్బలు తగిలిన నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత టీడీపీ వరుసగా ఓడిన నియోజకవర్గాల్లో ఈసారి ఎలాగైనా సరే గెలవాలనేది చంద్రబాబు ప్లాన్. అందులో భాగంగానే ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఈసారి ఎలాగైనా గెలవాలనేది చంద్రబాబు ప్లాన్.

2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత ఏర్పడిన యర్రగొండపాలెం నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు టీడీపీ ఓడిపోయింది. 2009లో కాంగ్రెస్ తరఫున ఆదిమూలపు సురేష్ గెలవగా… 2014లో పాలపర్తి డేవిడ్ రాజు వైసీపీ తరఫున గెలిచారు. 2019లో కూడా ఆదిమూలపు సురేష్ గెలవడంతో.. టీడీపీ వరుసగా 3 సార్లు ఓడిపోయింది. అలాగే మార్కాపురం నియోజకవర్గంలో 2009లో మినహా మిగిలిన రెండు సార్లు పార్టీ వరుసగా ఓడింది. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో కూడా వరుసగా మూడు సార్లు టీడీపీ ఓడింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలవగా… 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో పశ్చిమ ప్రకాశంలో ఎలాగైనా సరే టీడీపీ జెండా ఎగుర వేయాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచే ఈ మూడు నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు చంద్రబాబు.

ఈ ఏడాది బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలోనే మూడు రోజులు బస చేసిన చంద్రబాబు… తన పుట్టిన రోజును కూడా అక్కడే జరుపుకున్నారు. ఆ సమయంలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. గిద్దలూరులో ముత్తముల అశోక్ రెడ్డి, మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం నుంచి ఎరిక్షన్ బాబు పేర్లను అధికారికంగా ప్రకటించారు. అలాగే ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం తాగు, సాగు నీటి అవసరాల కోసం నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా వెల్లడించారు. అదే సమయంలో నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. మరోసారి ఈ ప్రాంతంలో పర్యటిస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని ఈ సారి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.