ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు… తప్పెవరిదీ…!?

ఓటర్ల జాబితా పరిశీలనలో చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయ్. బూత్ లెవల్ అధికారులు చేసిన పొరపాట్లు ఒకటొకటిగా వెల్లడవుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో జీరో డోర్ నెంబర్ పై అత్యధికంగా ఇళ్లు ఉన్నాయని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల పై అక్కడ అధికారులు వివరణ ఇచ్చారు.

రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభమైంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సక్రమంగా జాబితాను తయారు చేయలేదని, ఒకే డోర్ నెంబర్‌తో వందల ఓట్లు ఉండటంతో పాటు ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగించడం జరిగింది. ఒకే కుటుంబంలో వారి ఓట్లను వేర్వేరు పోలింగ్ బుత్స్‌లోకి మార్చడం కూడా చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో వలంటీర్లను భాగస్వాములను చేయకూడదని కూడా సూచించింది. ఈ క్రమంలో వలంటీర్లను వెంట పెట్టుకుని ఓటర్ల జాబితా పరిశీలనకు వెళ్లిన ఐదుగురు బూత్ లెవెల్ అధికారులను సస్పెండ్ చేశారు.

జీరో డోర్ నెంబర్ల వ్యవహారంపై కూడా విచారణ జరపాలని ఆదేశాలు అందాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్ద సంఖ్యలో జీరో డోర్ నెంబర్‌తో ఇళ్లు ఉన్నాయని తెలుగుదేశం ఆరోపించింది. అక్కడ కేవలం 865 ఓట్లు జీరో డోర్ నెంబర్‌తో నమోదయ్యాయని చెప్పిన నమోదు అధికారి… తర్వాత కలెక్టర్ ఆదేశాలతో మరో 717 ఓట్లు గుర్తించారు. మిగిలిన ఓటర్లను సున్నా డోర్ నెంబర్ల పరిధిలో ఫారం – 8 ద్వారా నమోదు చేస్తున్నామని వివరించారు. మొత్తం పరిశీలనలో 1,161 మంది ఓటర్ల జీరో డోర్ నెంబర్‌తో నమోదు అయ్యారని, ఇందులో 715 వాటికి డోర్ నెంబర్లు జులై 10వ తేదీ నాటికి సేకరించామని వివరించారు.

ఓటర్ల జాబితాలో మరికొన్ని కొత్త అంశాలు బహిర్గతమయ్యాయి. జీరో డోర్ నెంబర్‌లతో పాటు, కొంతమంది ఓటర్ల వివరాలను, ఫ్లాట్ నెంబర్‌లు వేశారని, మరికొంతమంది ఓటర్‌లకు గ్రామాలు, పట్టణాల్లోని ల్యాండ్ మార్క్ గుర్తును పేర్కొని సమీపంలో ఉండే ఇంట్లో అని ప్రస్తావించిన విషయాన్ని కూడా ఓటర్ల జాబితాలో తెలుగుదేశం గుర్తించింది. మరికొంతమంది ఓటర్లకు వీధి పేరు రాసి, డోర్ నెంబర్‌లు లేకుండా వదిలేశారని కూడా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. వీటన్నింటి పై తాము అభ్యంతరాలు లేవనెత్తుతున్నామని, ఓటర్లు ఉంటే వారికి డోర్ నెంబర్‌లు లేకుండా ఎలా ఉంటుందని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బూత్ లెవల్ అధికారులు గతంలో చేసిన పొరపాట్ల వల్లే ఓటర్ల జాబితాలో ఇన్ని రకాల అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రస్తుత పరిశీలనలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని తాము అభ్యంతరాలు లేవనెత్తుతున్నామని వివరించాయి.

ఎన్నికల కమిషన్ మాత్రం రాష్ట్రంలో జీరో డోర్ నెంబర్‌తో పాటు, ఓటర్ల జాబితాలో వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై కూడా ఇంటింటికీ పరిశీలనలో పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని బీఎల్‌ఓలను ఆదేశించింది. అందువల్లే రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్‌లను కూడా బూత్ లెవల్ అధికారులతో వెళ్లాల్సిందిగా కోరామని, వారికి ఉన్న అభ్యంతరాలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది.