ఏపీలో మహిళలకు రక్షణ కరువైందా..?… కేంద్రం నివేదికలో నిజమెంత..?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరువైందా..? మహిళల ప్రాణాలకు ఆంధ్ర రాష్ట్రంలో విలువ లేదా..? ఏపీలో పౌరుల వ్యక్తిగత డేటా చోరీకి గురవుతోందని.. మహిళలు, బాలికల మిస్సింగ్‌కు వాలంటీర్లే కారణమన్న జనసేనాని వ్యాఖ్యలు నిజమవుతున్నాయా..? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్లమెంట్‌ సాక్షిగా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైంది. అమ్మలు, అక్కచెల్లెమ్మలు అని మాట్లాడే జగన్‌రెడ్డి పాలనలో.. మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఇవి మేము చెబుతున్న మాటలు కాదు.. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిజాలు. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో భారీగా బాలికలు, మహిళలు మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. ఏపీలో అధిక సంఖ్యలో.. బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని తేల్చి చెప్పింది.

దేశంలో మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసులకు సంబంధించి.. కేంద్ర హోంశాఖ వివరాలను వెల్లడించింది. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 బాలికలు, 22,278 మహిళలు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 2019లో 2,186 బాలికలు, 6,252 మహిళల మిస్సింగ్ కేసులు.. 2020లో 2,374 బాలికలు.. 7,057 మంది మహిళల మిస్సింగ్ కేసులు.. 2021లో 3,358 బాలికలు, 8,969 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో మహిళల అదృశ్యానికి సంబంధించి గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈ వ్యవహారాన్ని వాలంటీర్లకు లింక్ చేస్తూ.. జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ దుమారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు పవన్ నిరాధారంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్లు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు మహిళల మిస్సింగ్ నిజమేనని కేంద్రం పార్లమెంటులోనే తేల్చేసింది. పవన్‌ ఆరోపణలను కొట్టిపారేసిన జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు కేంద్రం చెబుతున్న డేటా ప్రకారం మూడేళ్లలో దాదాపు 30 వేల మంది మిస్సయినట్లు తేలడంతో దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

అటు.. తెలంగాణలో మహిళలు, బాలికల మిస్సింగ్‌పై కేంద్రం వివరాలు వెల్లడించింది. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో.. తెలంగాణలో మొత్తం 8,066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే.. మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి.