పవన్‌పై వాలంటీర్ల కేసు..జగన్ పైకి లేపుతున్నారా?

ఇటీవల ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్..వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల కోసం పనిచేయాల్సిన వాలంటీర్లు..వైసీపీ ఏజెంట్లు మాదిరిగా పనిచేస్తూ..ప్రజల పర్సనల్ డేటాని వైసీపీకి చేరవేస్తున్నారని, ఆ డేటా మొత్తం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఉందని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళలు మిస్ అవుతున్నారని దానికి కారణం వాలంటీర్లు అని, ఏ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు..ఒంటరి, వితంతువు మహిళలు ఎంతమంది ఉన్నారని తెలుసుకుని, ఆ సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని అంటున్నారు.

ఇక పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. వాలంటీర్లు దైవాంశ సంభూతులు అని, వారిని అంటే పాపం తగులుతుందని శాపాలు పెడుతున్నారు. ఇక వాలంటీర్లు నిరసనలు తెలియజేశారు. ఇక పవన్ పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేశారంటూ పవన్‌కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయనపై కేసు నమోదు చేసేందుకు గ్రామ/వార్డ్‌ సచివాలయాల శాఖకు అనుమతి ఇచ్చింది.

నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతీశారని, పేద మహిళల్లో అభద్రతా భావం పెంచారని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ఇందుకుగాను పవన్‌ కల్యాణ్‌పై సీఆర్‌పీసీ 199(4)(బి), 1973 కింద సంబంధిత కోర్టులో కేసు నమోదు చేసేందుకు గ్రామ/ వార్డు సచివాలయశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. .

సరే కేసు పెట్టడానికి అనుమతించారు గాని…ఇది పూర్తిగా బెయిలబుల్‌ సెక్షన్‌. ఇక కేసు ఏం అవుతుందనేది పక్కన పెడితే..దీని ద్వారా పవన్‌ని జగన్ ప్రభుత్వం ఇంకా పైకి లేపుతుందని చెప్పవచ్చు. ఇది పూర్తిగా వైసీపీ చేస్తున్న పని అందరికీ అర్ధమైపోతుంది. కాబట్టి ఈ కేసు వల్ల పవన్‌కే బెనిఫిట్ అని చెప్పవచ్చు.