విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికో క్లారిటీ వచ్చిందా….!?

విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని నాని వ్యవహరిస్తున్నారు. 2014లో తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన నాని… 2019లో సైతం వైసీపీ హవాలో కూడా ఎంపిగా గెలిచి తన సత్తా ఏమిటో చూపించారు. అయితే తర్వాత కాలంలో నాని తీరు పలు విమర్శలకు తెర లేపింది. ప్రధానంగా విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నాటి నుంచి కూడా నాని తీరుపై పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉందనే చెప్పాలి. నాని కుమార్తె శ్వేత కార్పొరేటర్‌గా పోటీ చేశారు. పార్టీ గెలిస్తే.. మేయర్ అభ్యర్థి శ్వేత అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే టీడీపీలో నానికి వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. ఈ విషయాన్ని ఖండించారు. అంత సీన్ లేదు అన్నట్లుగా కామెంట్ చేశారు. దీంతో శ్వేత గెలిచినప్పటికీ… పార్టీ ఓడిపోయింది. దీంతో నాటి నుంచి కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి శ్వేతను బరిలోకి దింపాలనేది నాని ఆలోచన. ఇందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బుద్ధా వెంకన్న ఎప్పటి నుంచో భావిస్తున్నారు. దీంతో గొట్టం గాళ్లు అనే స్థాయి వరకు మాటల యుద్ధం దారి తీసింది.

ఇక అదే సమయంలో కేశినేని బ్రదర్స్ మధ్య కూడా అభిప్రాయ భేదాలు తలెత్తాయి. తన పేరుతో ఉన్న ఎంపీ స్టిక్కర్‌ను ఎవరో తెలియని వ్యక్తులు కారుకు అతికించుకుని తిరుగుతున్నారని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీరా చూస్తే.. ఆ కారు కేశినాని నాని సోదరుడు కేశినేని చిన్ని పేరు మీదే ఉంది. నాటి నుంచి విజయవాడ ఎంపీ టికెట్ కోసం చిన్ని ప్రయత్నం చేస్తున్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక చిన్ని కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరుసగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాన్యులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో నేతలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. అటు నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం స్కిల్ డెవలెప్‌మెంట్ పేరుతో యువతకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రతి చిన్న సమావేశానికి కూడా కార్యకర్తలను పంపుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలతో తరచూ భేటీ అవుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో చిన్నీకి పార్టీ ఎంపీ టికెట్ దాదాపు ఖరారైనట్లే అనే పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే చిన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే మార్గం సుగమం చేసుకుంటున్నారనే మాట కూడా వినిపిస్తోంది. మరి చిన్నీకి ఎంపీ టికెట్ ఇస్తే… కేశినేని నాని పరిస్థితి ఏమిటనే మాట కూడా వినిపిస్తోంది. దీనికి సమాధానం కావాలంటే… ఎన్నికల వరకు ఆగాల్సిందే.