బండి సంజయ్‌ను పూర్తిగా పక్కన పెట్టినట్లేనా….!

బండి సంజయ్… తెలంగాణలో ఓ ఫైర్ బ్రాండ్… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గుర్తింపు వచ్చిందంటే.. అది బండి వల్లే అనేది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా… బండి సంజయ్‌కు ముందు సైలెంట్‌గా ఉన్న బీజేపీ… రాష్ట్ర అధ్యక్షునిగా బండి బాధ్యతలు చేపట్టిన తర్వాత… ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఎంపీగా ఉన్న బండి.. పార్టీని గాడిలో పెట్టారనేది అక్షర సత్యం. సీనియర్ల మాట వింటూనే… పార్టీలో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 2 చోట్ల బీజేపీ గెలిచింది అంటే.. అందులో బండి పాత్ర ఉందనే చెప్పాలి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. పొత్తు పెట్టుకుంటే మేయర్ స్థానం కూడా బీజేపీదే… గణనీయంగా సీట్లు గెలిచిన బీజేపీ… అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా మేయర్ కుర్చి అందకుండా చేసిందనేది వాస్తవం. సీఎం కేసీఆర్‌పై బండి చేసినన్ని ఆరోపణలు… ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతలు కూడా చేయలేదు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ… అసెంబ్లీలో, బయట కూడా బీఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పట్టేలా చేశారంటే అది బండి సంజయ్ దూకుడు వల్లే. వరుస పాదయాత్రలతో నిత్యం ప్రజల్లో ఉంటున్న బండిని అధిష్ఠానం అధ్యక్ష పదవి నుంచి తొలగించింది.

బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని… రాబోయే ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేసేలా జాతీయ స్థాయి పదవి ఇస్తారని కూడా అంతా భావించారు. అయితే అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి అన్నట్లుగా మారింది పరిస్థితి. దాదాపు నెల రోజుల పాటు బండిని పక్కన పెట్టిన బీజపీ అధిష్ఠానం… ఇప్పుడు ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. మొత్తం 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించిన జేపీ నడ్డా… ఆ జాబితాలో బండి పేరు ఏడవ స్థానంలో ప్రస్తావించారు. దీంతో బండికి కేంద్ర మంత్రి పదవి లేనట్లే అని తేల్చేసినట్లైంది. బండిని అధ్యక్ష స్థానం నుంచి తొలగించినప్పటికీ.. కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గం భావించింది. కానీ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి అంటూ ప్రకటించడంతో… బండి వర్గం నిరాశ చెందుతోంది. దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.