పెడనలో తమ్ముళ్ళ పోరు..దెబ్బవేసేలా ఉన్నారు.!

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టి‌డి‌పి ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది.

వాస్తవానికి పెడన టి‌డి‌పి సీటు మొదట నుంచి కాగిత ఫ్యామిలీదే. గతంలో దివంగత కాగిత వెంకట్రావు పోటీ చేసేవారు..గత ఎన్నికల్లో ఆయన తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అక్కడ నుంచి ఇంచార్జ్ గా పనిచేస్తూ పెడనలో పార్టీని బలోపేతం చేసే దిశగా వెళుతున్నారు. అలాగే అన్నీ సర్వేల్లో అక్కడ కాగితకు గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలోనే టి‌డి‌పి నేత బూరగడ్డ వేదవ్యాస్ పెడన సీటు తనదే అని ప్రచారం మొదలుపెట్టారు.

అయితే అనేక పార్టీలు మారి వచ్చిన వేదవ్యాస్ సీటు ఎలా అడుగుతారని కాగిత వర్గం ఫైర్ అవుతుంది. 2004లో ఈయన మల్లేశ్వరం( నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఓడిపోయారు. తర్వాత టి‌డి‌పిలోకి వచ్చారు. 2019లో సీటు దక్కలేదు.

ఇప్పుడు సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే మొదట నుంచి పార్టీలో ఉన్న కాగిత ఫ్యామిలీని కాదని వేదవ్యాస్‌కు సీటు ఎలా వస్తుందని అంటున్నారు. రేపు ఏమైనా అయితే వేదవ్యాస్ మళ్ళీ పార్టీ మారకుండా ఉంటారనే గ్యారెంటీ లేదని, కానీ కాగిత ఫ్యామిలీ అలాగే ఉంటుందని, కాబట్టి వేదవ్యాస్ రాజకీయాలు ఆపాలని కాగిత వర్గం కోరుతుంది. ఏదేమైనా పెడన సీటు కాగితకే అని, గెలిచేది ఆయనే అని అంటున్నారు.