రాజమండ్రిలో ఆధిపత్య పోరు… ఎవరెవరికో తెలుసా…!?

రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో జగన్ హవాలో సైతం రాజమండ్రి పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. దీంతో రాజమండ్రి టీడీపీ అడ్డా అనే మాట వినిపిస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఎదురుదెబ్బలు తప్పవనే మాట బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆదిరెడ్డి భవాని… మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తేల్చేశారు. పైగా ఆమె స్థానంలో భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ నాకే అని కూడా ప్రచారం చేసుకుంటున్నారు వాసు. ఇదే సమయంలో రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రెడీ అవుతున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో… గెలుపు నల్లేరు మీద నడకే అనేది గోరంట్ల వర్గం మాట.

వాస్తవానికి రాజమండ్రి సిటీ పరిధిలో ఆదిరెడ్డి వర్సెస్ గోరంట్ల అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గోరంట్ల వర్గంతో ఏ నేత మాట్లాడినట్లు తెలిసినా సరే… వారిని ఆదిరెడ్డి వాసు మనుషులు పిలిపించి వార్నింగ్ ఇస్తున్నారని… అలాగే వారిపై వాసు తండ్రి అప్పారావు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. దీంతో… రాజమండ్రిలో ఇప్పటికే దాదాపు 10 మంది పైగా టీడీపీ కార్పొరేటర్లు వైసీపీలో చేరిపోయారు కూడా. అటు వాసు వ్యవహారంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎమ్మెల్యే భవాని కూడా ప్రస్తుతం దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిట్‌ఫండ్ సంస్థ మోసం కేసులో ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారిద్దరిని చంద్రబాబు సహా టీడీపీ నేతలు పరామర్శించారు. కానీ అది ఆర్థిక పరమైన లావాదేవీలనే విషయం బయటకు రాకుండా… కేవలం టీడీపీ, వైసీపీ గొడవలనే కోణంలోనే ప్రధానంగా ఫోకస్ చేశారు ఆదిరెడ్డి అభిమానులు. ఈ విషయం తర్వాత వెలుగులోకి రావడంతో… రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికపైన వాసుకు, అప్పారావుకు చంద్రబాబు మైక్ ఇవ్వలేదని పార్టీలో వినిపిస్తోంది.

ఇక జనసేనతో పొత్తు కుదిరితే… రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ఆ పార్టీ కావాలని కోరుతోంది. రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేసేందురు రెడీ అవుతున్నారు. అదే జరిగితే గోరంట్ల సిటీ నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఇప్పటికే వైసీపీ నేతలతో ఆదిరెడ్డి వాసు టచ్‌లో ఉన్నారని… తరచూ వైసీపీ ఎంపీలతో భేటీ అవుతున్నారనే పుకార్లు కూడా ప్రస్తుతం రాజమండ్రిలో షికారు చేస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.