పవన్ ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారూ….!?

పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు… గతంలో మాదిరిగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా… లేక ఒకటే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారా…. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కాకుండా… అన్న చిరంజీవిలా రాయలసీమకు వెళ్తారా… ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్నలు. వీటికి జనసేన పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ…. పవన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం క్లారిటీ ఇచ్చేస్తోంది. పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాటకు పవన్ తన వారాహి యాత్రతో ముంగింపు పలికినట్లుగా ఉంది. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత పవన్ మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ఇప్పటం గ్రామంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవ సభ నుంచి దూకుడు పెంచారు పవన్.

రెండు నియోజకవర్గాల్లో ఓడిన పవన్… రాబోయే ఎన్నికల్లో మాత్రం ఒకటే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ తగ్గాలో కాదు… ఎక్కడ నెగ్గాలో తెలియాలి అనే డైలాగ్ ఉన్నట్లుగా… ఎక్కడ పోటీ చేశామన్నది కాదు… గెలిచామా లేదా అన్నదే ప్రధానమని భావిస్తున్నారు. అలాగే ఎక్కడ పొగొట్టుకున్నామో…. అక్కడే వెతుక్కోవాలనేది కూడా పెద్దల మాట. అందుకే రాబోయే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి మరోసారి చేతులు కాల్చుకునే కంటే… ఒకదానిపైనే ఫోకస్ పెట్టడం వల్ల లాభం ఉంటుందని పవన్ భావిస్తున్నారు. అందుకే గతంలో పోటీ చేసిన గాజువాకను ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. పవన్ బీజేపీతో కలిసి ఉండటం వల్ల అక్కడ మరోసారి ఓటమి తప్పదని భావిస్తున్నారు. అందుకే భీమవరంపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పవన్. తరచూ భీమవరంలో పర్యటిస్తున్నారు.

వాస్తవానికి పవన్ భీమవరంలో ఓడిన తర్వాత… రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాలంటూ చాలా పేర్లు సోషల్ మీడియా ప్రచారంలోకి వచ్చాయి. పిఠాపురం, కాకినాడ సిటీ, సత్తెనపల్లి, తిరుపతి, దర్శ అంటూ తెగ వినిపించాయి. నాపై పోటీ చేసి గెలుస్తావా అంటూ వైసీపీ నేతలు కూడా చాలా మంది సవాల్ విసిరారు. కానీ వాటికి బదులివ్వని పవన్… తన ఫోకస్ అంతా భీమవరంపైనే పెట్టారు. అందుకే వారాహి తొలి విడత యాత్రను అనూహ్యంగా భీమవరం వరకు పొడిగించారు. భీమవరంలో రెండు రోజుల పాటు మకాం వేశారు. జనసైనికులతో ముచ్చటిచ్చారు. ఇక్కడే ఉంటా అంటూ జనసైనికులకు హామీ ఇచ్చారు. భీమవరంలో జరిగిన సభలో… నేను ఇక్కడే ఓడే… ఇక్కడే గెలుస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు పవన్.

ఇక పొత్తులుంటాయనే ప్రచారం జోరుగా జరుగుతన్న నేపథ్యంలో కూడా భీమవరం నుంచి పవన్ పోటీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఉన్నారు. ఆమెకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టమే. వయోభారంతో పాటు.. చాలా కారణాలు సీతారామలక్ష్మికి అడ్డుగా ఉన్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమంటున్నారు అటు జనసైనికులు… ఇటు తెలుగు తమ్ముళ్లు కూడా.