సిక్కోలు టీడీపీలో ఆధిపత్య పోరు… రింగ్ లీడర్ గ్రూప్ పాలిటిక్స్…!

సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రంగంలో ఎవరుంటారు అనే చర్చ జోరుగా నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వై నాట్ 175 అని జగన్ అంటుంటే… వై నాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు. ఇదే మాటను స్ఫూర్తిగా తీసుకుని ఇరుపార్టీల నేతలు జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. వైసీపీ తరఫున సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు లేదా ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పోటీ చేయడం దాదాపు ఖయమైంది. అయితే టీడీపీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సిక్కోలులో తెగ ప్రచారం చేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అదే సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదని… కాబట్టి టికెట్ ఇంకా ఖరారు కాలేదని గొండు శంకర్ వర్గం ప్రచారం చేస్తోంది.

శ్రీకాకుళం అసెంబ్లీ టీడీపీ టికెట్ కోసం గుండ లక్ష్మిదేవితో పాటు గొండు శంకర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు కూడా. ఆయనకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అండదండలు కూడా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అసలు సిక్కోలులో గుండ కుటుంబానికి వ్యతిరేకంగా గొండు శంకర్‌ను ప్రొత్సహిస్తోంది ఆ నేత కుటుంబమే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే… మాజీ మంత్రికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి. అదే సమయంలో గుండ లక్ష్మిదేవిపై కూడా నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గుండ కుటుంబం ఓ నలుగురు చెప్పు చేతల్లోనే ఉందని… వారు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తోందనే అపవాదు ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ చెప్పిన మాట తప్ప… మరొకరి మాటను లక్ష్మిదేవి వినడం లేదని… అందుకే టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సిక్కోలు నుంచి అసెంబ్లీ అభ్యర్థి ఎవరూ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. చంద్రబాబుతో గుండ కుటుంబం భేటీ అయినా కూడా… ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి… దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనే మాట వినిపిస్తోంది.