జగ్గయ్యపేట టీడీపీలో నేతల సిగపట్లు…!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ… ముందస్తు పుకార్లు వినిపిస్తున్నాయి. గతానికి పూర్తి భిన్నంగా నేతలంతా ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక నియోజకవర్గ స్థాయి నేతలైతే ఎన్నికల్లో టికెట్ కోసం అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. కీలక నియోజకవర్గాల్లో కూడా ఈ సారి టీడీపీ గెలుపు కష్టమనే మాట బలంగా వినిపిస్తోంది. రాజధాని పరిధిలో తమకు తిరుగు లేదని గతంలో గుడ్డిగా భావించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలతో పాటు చుట్టు పక్కలున్న అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. కృష్ణా నదికి ఈ గట్టునున్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను విజయం సాధించారు.

రాష్ట్రంలో అత్యధిక కమ్మ సామాజికవర్గం ఓట్లు ఉన్న నియోజకవర్గం జగ్గయ్యపేట. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన నెట్టెం రఘురామ్ మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2009 నుంచి పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు జగ్గయ్యపేట మునిసిపల్ ఛైర్మన్‌గా ఉన్న శ్రీరామ్ రాజగోపాల్ అనూహ్యంగా టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కూడా రెండోసారి శ్రీరామ్ తాతయ్య గెలిచారు. అయితే 2019లో మాత్రం కేవలం పార్టీ అంతర్గత విభేదాల కారణంగానే శ్రీరామ్ తాతయ్య ఓడినట్లు ఇప్పటికీ ఆయన వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇవి కేవలం ఆరోపణలే కాకుండా… వాస్తవాలు అనేందుకు రుజువులు కూడా ఉన్నాయనేది బహిరంగ రహస్యం.

నియోజకవర్గంలో పెత్తనం కోసం నెట్టెం రఘురామ్‌తో పాటు టీడీపీ కీలక నేత టీడీ జనార్థన్ గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో నియోజకవర్గంలో ఈసారి శ్రీరామ్ తాతయ్యకు బదులుగా… కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చారు. కానీ ఆ ప్లాన్ అంతగా వర్కవుట్ కాలేదు. డబ్బు అయితే ఖర్చు పెట్టారు కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు.. ప్రచార రథంపైకి రావాలని కేవలం శ్రీరామ్ తాతయ్యను మాత్రమే ఆహ్వానించారు. ఈ వ్యవహారం ఆయన వ్యతిరేక వర్గానికి మింగుడు పడలేదు. దీంతో దాదాపు ఏడాది కాలంగా శ్రీరామ్ తాతయ్యకు వ్యతిరేకంగానే ఆ ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్నారనేది పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు నెట్టెం రఘురామ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేతగా ఉన్న ఆయన.. ఆఖరి అవకాశం ఇవ్వాలని అధినేతను కోరినట్లు సమాచారం. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం.. ఈసారి ఆ ఇద్దరు నేతలను కాదని.. కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై సర్వే నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు 20 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ… రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్న టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికర సమితి అధ్యక్షురాలు ఆచంట సునీత పేరును కూడా టీడీపీ అధినేత పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కూడా ఆమె పని చేశారు. దీంతో అచంట సునీతకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే విషయంపై కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం కుస్తీలు పడుతున్న తెలుగు తమ్ముళ్లు.. మహిళా నేతకు సహకరిస్తారా లేదా అనేది చూడాలి.