జగన్ దసరా ముహుర్తం… ఫలితం ఇస్తుందా…!

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వెళ్తారని ఓ సారి… కాదు కాదు.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జమిలీ ఎన్నికలు మరోసారి పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 ఎన్నికల సమయంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ఒకేసారి ప్రకటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇదే సమయంలో ఇలా ఎవరైనా ప్రకటించగలరా అని సవాల్ కూడా విసిరారు. అయితే ఈ సారి మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

ముందస్తు ఎన్నికల పుకార్లకు ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తున్న వైఎస్ జగన్… షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పలుమార్లు పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రివ్యూ సమావేశంలో కూడా ఈ తొమ్మిది నెలలు మీరు కష్టపడండి… మిగిలిన సంగతి నేను చూసుకుంటా అని హామీ కూడా ఇచ్చారు. అలాగే ప్రజల్లో మంచి అభిప్రాయంలేని ప్రజాప్రతినిధులకు ఈ సారి టికెట్లు ఇచ్చేది లేదని తేల్చేశారు కూడా. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూడా…. ప్రజాప్రతినిధులు మాత్రం నిత్యం ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం నుంచి జరిగిన లబ్దిని లెక్కలతో సహా చెబుతున్నారు.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీకి ఏ పార్టీ అండగా ఉండదని… ప్రజలే అండగా ఉండి గెలిపించాలని కూడా పలు సందర్భాల్లో బహిరంగ సమావేశాల్లో జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలోన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను జగన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 72 మంది పేర్లను జగన్ ప్రకటించనున్నారనే వార్త ఇప్పుడు పార్టీ నేతల్లో కూడా కలవరం రేపుతోంది. నిజంగా జగన్ అలా జాబితా ప్రకటిస్తే… అందులో తమ పేరు ఉంటుందా ఉండదా అనే భయం పార్టీ నేతల్లో మొదలైంది. అసలింతకూ ఆ 72 నియోజకవర్గాలేమిటీ… కేవలం సీనియర్ల పేర్లు మాత్రమే జగన్ ప్రకటిస్తారా… లేక కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అభ్యర్థుల ప్రకటన వార్త మాత్రం… వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.