ఎంపీకి ఈ సారి టికెట్‌ ఉందా… లేదా…?

రాజమండ్రి సిటీ టికెట్ ఎవరికో అంటూ ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై ఆసక్తికర చర్చ జరుగుతుందా…? రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న ఎంపీ మార్గాని భరత్‌… ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భయపడుతున్నారా….?…. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన తర్వాత ఎంపీ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనపై ఎంపీ వ్యతిరేక వర్గం ఏమంటోంది…? రాజమండ్రి ఎంపీ కార్యాలయ ప్రకటనపై వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు.

గోదావరి జిల్లాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక ఎంపీ మార్గాని భరత్… 2019 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు భరత్. అయితే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే…. ఎంపీ భరత్ మాత్రం కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పరిమితమయ్యారు. మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో ఎంపీ భరత్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమలు కాని హామీలతో ఎన్నికల్లో గెలిచిన భరత్‌… ఆ తర్వాత ప్రజలు వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎక్కడికెళ్లినా నిలదీతలే ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎంపీలంతా ఐదేళ్ల పాటు అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజల్లోనే ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సఖ్యతగా మెలిగారు. అయితే ఎంపీ భరత్ రామ్ మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరించి… ఎమ్మెల్యేల్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్నారనే భావన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

రాజమండ్రి ఎంపీ వ్యవహార శైలి పార్టీ లోనే వేరు కుంపట్లకు దారితీసింది. ఎంపీ తీరుకు వ్యతిరేకంగా కొంతమంది సీనియర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఎంపీని వ్యతిరేకిస్తూ పార్టీ సీనియర్లు సైలెంట్‌గా ఉంటున్నారు. ఎంపీ భరత్ ఏక చత్రాధిపత్యం పార్టీలో మైనస్‌గా మారింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఎంపీ తీరుపై ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగాను చర్చకు దారితీసింది. ఎంపీ మార్గాని భరత్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో వైసీపీలోని కీలక నేతలంతా ఒక గ్రూపుగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఎంపీ ప్రచార పిచ్చితో చేపట్టిన రచ్చబండ అభాసుపాలైంది. ప్రజల సమస్యలు పరిష్కరించకపోగా వ్యక్తిగత జీవితాలను ఎంపీ ఫేస్ బుక్‌లో ప్రచారం చేసుకోవటం పైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాజమండ్రి సుందరీకరణ పేరుతో ఎంపీ ఆదేశాలతో అధికారులు చేపట్టిన పనులు విమర్శలకు తెరలేపాయి. సుందరీకరణ పేరుతో ఎంపీ అవినీతికి పాల్పడుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎంపీ ప్రచార ఆర్భాటంతో అనవసరమైన పనులు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉంది.

రాజమండ్రి నా అడ్డా…. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలు బద్దలు కొడతా.. అంటూ ఎంపీ భరత్ పదేపదే ప్రచారం చేస్తున్నారు. అయితే ఓటమి భయంతోనే టీడీపీకి కంచుకోటగా ఉన్న రాజమండ్రి నగరపాలక సంస్థకు కనీసం ఎన్నికలు జరిపేందుకు కూడా ఎంపీ భరత్ భయపడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈనెల 3వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌ను తన తండ్రితో కలిసి కలిశారు ఎంపీ భరత్. ఈ భేటీ తర్వాత ఎంపీ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన ఆసక్తికరంగా మారింది. రాజమండ్రి సిటీ వైసీపీ టికెట్ ఎవరికో…? పరిశీలనలో ఎంపీ భరత్ పేరుతో పాటు మరికొంత మంది నేతలు పేర్లు, ఎవరి ప్రయత్నం వారిది… అంటూ ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు రాజమండ్రి ఇంఛార్జ్‌గా ఉన్న ఎంపీ భరత్‌ను పార్టీ అధిష్టానం తొలగించింది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ భరత్‌కు రాజమండ్రి సిటీ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించినట్టు ఎంపీ వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. రాజమండ్రి సిటీ టికెట్‌ రేసులో మార్గాని భరత్‌ ఉన్నారనే ప్రచారాన్ని ఆయనే ప్రచారం చేసుకుంటున్నారనే చర్చ వైసీపీ క్యాడర్‌లోనే జరుగుతోంది.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అదే తిరుగుబాటును ఎంపీ భరత్ చేస్తారనే భయంతోనే వైసీపీ అధిష్టానం అచితూచి వ్యవహరిస్తుందని… వచ్చే ఎన్నికల్లో ఎంపీ భరత్‌కు ఎక్కడ నుంచి వైసీపీ టికెట్ రాదని ఎంపీ వ్యతిరేకవర్గం ప్రచారం చేస్తోంది. ఇదండీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపీ భరత్ కలిసిన తర్వాత ఎంపీ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన పై తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితి. మరి ఈ చర్చకు బ్రేక్ ఎప్పుడు పడుతుందో చూడాలి.