రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏమిటీ..?

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదా?… సర్వే రిపోర్టులు ఆ పార్టీ అధినేత కేసిఆర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయా?… అందుకే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారా?…. అందులో వెనుకబడ్డ నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారా?…. రిజర్వుడ్ నియోజకవర్గాలపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?

తెలంగాణలో వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పార్టీలన్నీ దూకుడు పెంచాయి. దాంతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మరోసారి అధికార పీఠం ఎక్కాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఇప్పటికే జిల్లాల టూర్ మొదలు పెట్టారు. బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే టికెట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అందుకోసమే ఇటు నిఘా వర్గాలు, అటు ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వేలు జరిపిస్తున్నారు. ఆ రిపోర్టుల ఆధారంగా సిట్టింగ్‌లను మార్చే విషయంలో కసరత్తు చేస్తున్నారు. అయితే మెజారిటీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పరిస్థితి బీఆర్ఎస్‌కు ఆశాజనకంగా లేదని కేసిఆర్‌కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వుడ్ స్థానాల్లో దాదాపు 80 శాతం ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

తెలంగాణలో మొత్తం 31 రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ప్రస్తుతం 3 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా, మిగతా 28 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం మందికి వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదురుకానున్నట్టు గులాబీ బాస్ రిపోర్టులో తేలినట్లు ప్రచారం. అందుకే పనితీరు మార్చుకోవాలని కొన్ని నెలలుగా సదరు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇద్దరు, ముగ్గురు మినహా మిగతావారి పనితీరు మెరుగుపడలేదని పార్టీ అధినేత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్టు టాక్. ఇక టికెట్ దక్కని వారు ఇతర పార్టీలోకి వెళ్లినా… పెద్దగా నష్టం లేదని కేసీఆర్ డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.

రిజర్వ్ స్థానాల్లోని మెజారిటీ సిట్టింగులకు లోకల్‌గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లతో సఖ్యత లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు పాత కొత్త కేడర్‌ను కలుపుకుని పోకుండా గ్రూపు తగదాలను సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎంల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌పై సీఎం కేసీఆర్ పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అక్కడ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తరచూ వివాదాల్లో ఉండటం పట్ల కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు టాక్. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను పక్కన పెట్టడం ఖాయం అనే ప్రచారం కారు పార్టీలో చక్కర్లు కొడుతోంది. ఇక మరో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలు, అచ్చంపేట సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు మధ్య వర్గపోరు విషయంపైనా ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.

ఇటీవల నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా డోర్నకల్‌లో ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ను ప్రజలు తరచూ అడ్డుకోవడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి ఎంపీ కవితని బరిలో దించే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మహబూబాబాద్‌ సెగ్మెంట్‌లో కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో స్థానిక ఎమ్మెల్యే పై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పట్ల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహరించిన తీరును ఉదాహరణగా చెబుతున్నారు. మహబూబాబాద్‌ నుంచి మంత్రి సత్యవతి రాథోడ్‌ను బరిలోకి దింపుతారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ధర్మపురిలో 2018 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం హిట్ లిస్ట్‌లో ఉన్నారని టాక్. నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ మారిన చిరుమర్తి లింగయ్య పట్ల కూడా వ్యతిరేకత ఉందని కారు పార్టీ రిపోర్ట్ చెబుతుందట. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ హిట్ లిస్ట్‌లో ఉన్నారని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అధినేత గుర్రుగా ఉన్నారనే ప్రచారం ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్యేల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్‌లకు మొండిచెయ్యి చూపడం దాదాపు ఖాయమంటున్నారు బీఆర్ఎస్‌ నేతలు.