అప్పులు కోసం ఏపీ సర్కారు పరుగులు… నిజమేనా…?

ఏపీ ప్రభుత్వం అందితే అప్పులు తీసుకొస్తోంది…. నెలచివరకు వచ్చేసరికి అప్పుల కోసం వెంపర్లాడుతోంది… నిధులను మళ్లించి వేరు అవసరాలకు వాడుతోందని… ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలాసీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన రూ.30,500 కోట్ల రుణ పరిమితి పూర్తి కావడంతో ఏపీకి మళ్లీ అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి నేటి వరకూ ఫలించలేదు. దీంతో, వచ్చే నెలలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లు ఇచ్చేందుకు , డ్వాక్రా మహిళలకు రుణాల చెల్లింపుల కోసం ఇప్పుడు అప్పుల కోసం ప్రభుత్వం వేట ప్రారంభించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ల ద్వారా ఏపీ ప్రభుత్వానికి జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో జాతీయ బ్యాంక్ లు ముఖం చాటేశాయి. ఈలోపు ప్రభుత్వం కార్పొరేషన్‌ల ద్వారా బాండ్లు విడుదల చేసి రుణాలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా లిక్కర్ బాండ్ల వేలం, ఇతర మార్గాల ద్వారా సుమారు రూ.38 వేల కోట్ల రుణం సేకరించింది. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నేరుగా ఖజానాకు జమ చేయకుండా బేవరేజస్ కార్పొరేషన్ కు మళ్లిస్తుండటం, ఈ ఆదాయాన్ని ఆధారంగా చూపి బాండ్లు విడుదల చేసి నిధులు సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు సమీకరించిన ప్రభుత్వం…. ఇప్పుడు తాజాగా మళ్లీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రుణం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని పై ఇప్పటికే స్టాక్ ఎక్సేంజ్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసి ఈ బాండ్ లను కొనుగోలు చేయవద్దని చెప్పడంతో ప్రభుత్వం మళ్లీ రూట్ మార్చి బాండ్లను విడుదల చేసి ఈ నెలాఖరుకు మరో రూ.5 వేల కోట్లను రుణంగా సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో మరో రూ.7 వేల కోట్లు సమీకరించాలని ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.

ఏపీలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలకు నిధులు విడుదల చేస్తుండటంతో ఆ నిదులను రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి పలువురు ఫిర్యాదు చేశారు. ఇటీవల సర్పంచ్‌ల ఛాంబర్ దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసి తమకు కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్ధిక సంఘాల కింద ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని, వాటిని కరెంట్ బిల్లుల నెపంతో జమ వేసుకున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పంచాయితీల పేరిట ప్రత్యేక అకౌంట్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ, అకౌంట్‌ ఓపెన్‌ చేయించారే కానీ… నిధులను ఆ అకౌంట్‌లకు వెళ్లనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే వాడేసుకుంది. ఇటీవల పంచాయితీ సర్పంచ్ లు ఆందోళన చేయడంతో తాజాగా, 350 కోట్ల రూపాయల వరకూ పంచాయితీలకు విడుదల చేసింది. ఇవి కాకుండా పంచాయితీలకు సుమారు రూ.10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సి ఉందని కూడా సర్పంచ్‌ల ఛాంబర్ పేర్కొంది. ఈ అంశం దగ్గుబాటి పురంధేశ్వరికి వివరించారు. పురంధేశ్వరి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలసీతారామన్‌ను కలిసి రాష్ట్రంలో నిధుల మళ్లింపు ఆర్ధిక క్రమశిక్షణారాహిత్యం పై ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో ఇటీవల అనేక సంఘాలు, ఇతర సంస్థలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసి ఏపీ ప్రభుత్వం కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులను మళ్లిస్తున్న వైనాన్ని ఆమె దృష్టికి తెచ్చారు. వీటి పైనే పురంధేశ్వరి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి ఫిర్యాదు చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రేపో, మాపో కేంద్ర ఆర్ధిక శాఖ రాష్ట్ర స్పందిస్తుందని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలసీతారామన్‌తో మంచి సమావేశం జరిగిందని, తమ చర్చలు ఫలప్రదమవుతాయని భావిస్తున్నామని పురంధేశ్వరి ఆకాంక్షించారు.