కడియం వర్సెస్ రాజయ్య..ఆగని పంచాయితీ..కారుకు చిక్కులు.!

రాజకీయ ప్రత్యర్ధులు ఎప్పటికైనా ప్రత్యర్ధులే అన్నట్లు ఉంది..కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలని చూస్తుంటే. ఒకప్పుడు ప్రత్యర్ధులుగా తలబడ్డారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రత్యర్ధులుగానే రాజకీయం చేస్తున్నారు. చివరికి వీరి వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మొదట నుంచి వీరు ప్రత్యర్ధులుగా తలపడుతూ వస్తున్నారు.

గతంలో శ్రీహరి టి‌డి‌పి నుంచి, రాజయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉండేవారు. ఒకోసారి ఒకరు పై చేయి సాధిస్తూ ఉండేవారు. 1994, 1999 ఎన్నికల్లో శ్రీహరి గెలిచారు. మళ్ళీ 2008 ఉపఎన్నికలో గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాజయ్య గెలిచారు 2012లో బి‌ఆర్‌ఎస్ నుంచి రాజయ్య గెలిచారు. ఇక తర్వాత కడియం కూడా బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఘనపూర్ నుంచి రాజయ్య, వరంగల్ ఎంపీగా కడియం గెలిచారు. ఇక కే‌సి‌ఆర్ ప్రభుత్వంలో రాజయ్య మంత్రి అయ్యారు. కొద్ది రోజులకే పదవి పోగొట్టుకున్నారు.

ఆ తర్వాత కడియంని ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. ఇక 2018లో మళ్ళీ రాజయ్య గెలిచారు. ఇటు కడియంకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక తర్వాత నుంచి వీరి మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఘనపూర్ సీటుపై పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో నియోజకవర్గాన్ని తానే అభివృద్ధి చేశానని, ఇప్పుడు మొత్తం దోపిడి జరుగుతుందని కడియం ఆరోపిస్తున్నారు.

గతంలో కడియం ఎన్‌కౌంటర్ల స్పెషలిస్ట్ అని, తాను మొదట నుంచి ఆస్తిపరుడు అనే..మరి ఏమి లేని కడియం కోట్లకు అధిపతి ఎలా అయ్యారని రాజయ్య ప్రశ్నిస్తున్నారు. అసలు కడియంని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అంటున్నారు. ఇలా ఇద్దరి మధ్య రచ్చ జరుగుతుంది. ఇక చివరికి సీటు ఎవరికి దక్కుతుందో గాని..ఘనపూర్ లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది.