సౌత్‌పై మోదీ ఫోకస్..రామేశ్వరం బరిలో?

బీజేపీకి ఉత్తర భారతదేశంపై పట్టు ఉంది గాని..దక్షిణ భారతదేశంపై పెద్దగా పట్టు లేని సంగతి తెలిసిందే. ఇక్కడ బి‌జే‌పిని ప్రజలు ఆదరించడం తక్కువే. కొద్దో గొప్పో కర్నాటకలోనే బి‌జే‌పికి పట్టు ఉంది. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బి‌జే‌పి ఓడిపోయింది. దీంతో బి‌జే‌పికి ఊహించని దెబ్బ తగిలింది. అసెంబ్లీలో ఓడిన పార్లమెంట్ లో సత్తా చాటుతామని బి‌జే‌పి భావిస్తుంది. అందుకే తాజాగా దక్షిణాదిపై జే‌పి నడ్డా ఫోకస్ చేసి టార్గెట్ 170 అని బి‌జే‌పి నేతలకు దిశానిర్దేశం చేశారు.

అంటే దక్షిణాదిలో 170 సీట్లు గెలవాలనేది బి‌జే‌పి టార్గెట్. ఇక ఈ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది అసాధ్యం. కానీ ఎంతోకొంత పై చేయి సాధించడానికి బి‌జే‌పి రకరకాల వ్యూహాలతో ముందుకొస్తుంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో మోదీ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారని ప్రచారం వస్తుంది. అయితే గత రెండు ఎన్నికల్లో ప్రసిద్ధ శైవక్షేత్రం కాశీ ఉన్న..వారణాసి పార్లమెంట్ లో పోటీ చేస్తూ మోదీ గెలుస్తున్నారు.

ఈ సారి మాత్రం వారణాసితో పాటు తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం రామేశ్వరం(రామనాథపురం నియోజకవర్గం) నుంచి పోటీ చేయాలని మోదీ చూస్తున్నారని తెలిసింది. ఈ మేరకు బి‌జే‌పి వర్గాలకు సమాచారం వచ్చిందని ప్రముఖ తమిళ పత్ర్రిక  కథనం ఇచ్చింది. అయితే తమిళనాడులో అధికార డి‌ఎం‌కే బలంగా ఉంది. అటు బి‌జే‌పికి బలం శూన్యం..తమతో పొత్తులో అన్నాడి‌ఎం‌కే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే మోదీ పోటీ చేస్తే తమిళనాడుపై బి‌జే‌పి పట్టు సాధించవచ్చు అని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చు అనేది ప్లాన్.

కాకపోతే తమిళనాడులో బి‌జే‌పి రాణించడం సాధ్యమయే పని కాదు. ఇక మోదీ పోటీ చేయాలని అనుకుంటున్న రామేశ్వరంలో ముస్లిం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే తమ కూటమి భాగస్వామి అయిన ఐఎంయూఎల్‌కు ఈ నియోజకవర్గాన్ని కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థి నవాజ్‌ ఘన విజయం సాధించారు. చూడాలి మరి మోదీ రామేశ్వరం బరిలో దిగుతారో లేదో.