దువ్వాడకు సొంత సెగలు..టెక్కలిలో అచ్చెన్నకే ప్లస్.!

అధికార బలం ఉంది కదా అని..ఎడాపెడా రాజకీయం చేస్తే కుదరదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా చేస్తే..తర్వాత ప్రజలే తిరస్కరిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే కొందరు వైసీపీ నేతలు అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవి ఏ స్థాయికి వెళుతున్నాయంటే సొంత పార్టీ నేతలే ఎదురు తిరిగే పరిస్తితికి వస్తుంది.

ఇప్పుడు తాజాగా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు అదే జరుగుతుంది. ఆయనపై సొంత పార్టీ నేతలే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. మూలపేట పోర్టు నిర్మాణానికి ఏప్రిల్‌ 19న జగన్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. అయితే కాంట్రాక్టు వర్కులు కోసం మూలపేట సర్పంచ్ జీరు బాబూరావు తిరుగుతున్నారు. కానీ ఎక్కడ తిరిగిన కూడా కాంట్రాక్టు ఇవ్వడం లేదని, వీటి కోసం పెత్తందారుల చుట్టూ తిరగాల్సివస్తోందని, ఇదెక్కడి న్యాయం అని సర్పంచ్‌ జీరు బాబూరావు, పోర్టు బాధితులు విజయవాడలో సజ్జల రామకృష్ఠారెడ్డిని కలిసి ఫిర్యా దు చేశారు.

అయితే ఉన్న ఊరిని, పంట పొలాలను, భూములను త్యాగం చేసింది తామైతే.. దువ్వాడ శ్రీనివాస్‌, అతని సోదరులు, అనుచరుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు, లేబర్‌ కాంట్రాక్టు.. ఇలా అన్నింటా ఎమ్మెల్సీ పెత్తనమే ఉందని, అతడి నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఇలా ఎమ్మెల్సీకి సొంత పార్టీ నుంచే సెగలు వస్తున్నాయి.

ఇక టెక్కలి నియోజకవర్గం పరంగా కూడా దువ్వాడకు అనుకున్న మంచి పేరు కనబడటం లేదు. అందుకే ఆయన్ని అభ్యర్ధిగా తప్పించి..ఆయన భార్య వాణికి టెక్కలి సీటు ఇస్తున్నారు. మొత్తానికి దువ్వాడ వైఖరే టెక్కలిలో అచ్చెన్నాయుడుకు ప్లస్ అని అంటున్నారు.