కిషన్‌తో కమలం వికసించేనా..బండిని మైనస్సేలే ముంచాయి.!

మొత్తానికి తెలంగాణ బి‌జే‌పి నాయకత్వంలో భారీ మార్పు చోటు చేసుకుంది. అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్న బండి సంజయ్‌ని తప్పించి సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. అయితే మొదట బండిని పదవి నుంచి తప్పించడానికి పలు కారణాలు ఉన్నాయి. బండి ఎంపీగా గెలిచాక అధ్యక్ష పదవి వరించింది..పదవి వచ్చాక దూకుడుగా పనిచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బి‌జే‌పి గెలిచింది.

జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టారు. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పినే ప్రత్యామ్నాయం అనే స్టేజ్ కు తీసుకొచ్చారు. అలాంటి పరిస్తితి నుంచి ఇప్పుడు బి‌జే‌పి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందా? అనే పరిస్తితికి వచ్చింది. రాజకీయంగా బండి ఒంటెద్దు పోకడలతో వెళుతున్నారనే విమర్శలు…సీనియర్లు అయిన ఈటల రాజేందర్, రఘునందన్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు వచ్చాయి. ఇలా తనదైన శైలిలో వెళ్లడమే మైనస్ అయింది.

బండి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయి..దీంతో బండిని తప్పించి..కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. గతంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడుగా పనిచేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదనంగా అధ్యక్ష పదవి వచ్చింది. అయితే కిషన్‌కు అధ్యక్ష పదవి కొత్త కాదు..కానీ ఇప్పుడు పార్టీ పరిస్తితి వేరుగా ఉంది. నేతల మధ్య విభేదాలు ఉన్నాయి..అదే సమయంలో బలంగా ఉన్న బి‌ఆర్‌ఎస్‌ని ఎలా ఎదురుకుంటారు…బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీ కొడతారు అనేది పెద్ద ప్రశ్న.

అయితే ఇటు ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి వచ్చింది. దీంతో ఈటల-కిషన్ మధ్య సమన్వయం ఎలా ఉంటుంది..ఇద్దరు ఎలా ముందుకెళ్తారనేది చూడాలి. చూడాలి ఇంకా కిషన్ రెడ్డి…బి‌జే‌పిని గెలిపిస్తారో లేదో.