గత 6 ఆరు నెలల్లో డిజాస్టర్ సినిమాలివే.. నిర్మాతలకు భారీ నష్టాలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి 2023 తొలి అర్ధభాగం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. భారీ బడ్జెట్ చిత్రాలు పలు విడుదలైనా అవి ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. భారీ నష్టాలను మూటగట్టుకుని బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. బయ్యర్లకు, నిర్మాతలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. ఇక ప్రేక్షకులు సైతం చాలా ఆశలు పెట్టుకున్నా, వారిని ఆ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇందులో స్టార్ హీరోల సినిమాలు సైతం ఉన్నాయి. ఆ జాబితాను పరిశీలిద్దాం. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకులలో చాలా అంచనాలు ఉండేవి. దీని కోసం ప్రభాస్ అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ప్రభాస్‌ను రాముడి పాత్రలో చూడాలని చాలా కోరికగా ఉండేవారు. ఇలాంటి తరుణంలో ఆ సినిమాలో తీసుకున్న స్టోరీ, డైలాగులు చాలా వివాదాస్పదం అయ్యాయి. పైగా నేపాల్ వంటి చోట్ల దానిని ఏకంగా బ్యాన్ చేశారు. దేశంలో పలు చోట్ల తొలి వారం బాగానే ఆడినా తర్వాత క్రమంగా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం మానేశారు. రూ.500ల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ.50 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది.

అక్కినేని అఖిల్‌ వరుస సినిమాలు చేస్తున్నా, అతడికి ఏవీ కలిసి రావడం లేదు. ఈ సారి డిఫరెంట్ జోనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు అఖిల్ వచ్చాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదల అయింది. అయితే తొలి రోజు నుంచే దీనిపై నెగెటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డిపై అఖిల్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులంతా మండిపడ్డారు. ఈ సినిమాకు రూ.30 కోట్ల నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా శాకుంతలం కూడా ప్రేక్షకులను బాగా నిరాశపర్చింది. సినిమా విడుదలకు ముందు దీనిపై విపరీతమైన హైప్ వచ్చింది. సమంత లీడ్ రోల్ పోషించడం, అల్లు అర్హ ఇందులో నటించడం, గుణశేఖర్ దర్శకత్వం, భారీ బడ్జెట్ వంటి అంశాలు దీనిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచాయి.


తీరా విడుదలయ్యాక ప్రేక్షకులు పెదవి విరిచారు. అందరికీ తెలిసిన కథ కావడం, సినిమాలో ప్రేక్షకులను కట్టి పడేసే అంశాలేవీ లేకపోవడంతో సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు. పైగా ఇది తనకు భారీ నష్టాన్ని ఇచ్చిందని నిర్మాత దిల్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు లాంగ్ రన్‌లో రూ.50 కోట్ల నష్టాలు వచ్చినట్లు సమాచారం.