గంటా నియోజకవర్గం ఏదో ఫుల్ క్లారిటీ….!

గంటా శ్రీనివాసరావు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రాజకీయ వేత్త. చిన్నస్థాయి నుంచి వచ్చిన గంటా… ఒక జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది వాస్తవం. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడమే గంటా ప్రత్యేకత. 1999లో తొలిసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గంటా విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో చోడవరం నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన గంటా… అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి… ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో కూడా మంత్రిగా పని చేశారు గంటా. ఇక 2019లో విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ జగన్ హవాలో కూడా గెలిచారు.

వరుసగా 5 సార్లు విజయం సాధించిన గంటా.. ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏ ఒక్కసారి కూడా పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయలేదు. చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గాలు గంటాను గెలిపించాయి. అయితే రాబోయే ఎన్నికల్లో గంటా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ప్రస్తుతం విశాఖ జిల్లాలో జోరుగా జరుగుతున్న చర్చ. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే దాదాపు మూడున్నరేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు. చివరికి అధినేత పర్యటనలకు కూడా గంటా హాజరు కాలేదు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే అది ఇప్పటికీ స్పీకర్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా… లేక నియోజకవర్గం మారుస్తారా అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరోవైపు రాబోయే ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. 1983లో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 1999 ఎన్నికల వరకు వరుసగా 5సార్లు టీడీపీ అభ్యర్థి రెడ్డి సత్యనారాయణ విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ గెలవగా… 2009లో టీడీపీ అభ్యర్థి గరివిడి రామానాయుడు విజయం సాధించారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ తరఫున బూడి ముత్యాల నాయుడు గెలిచారు. ప్రస్తుత జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా వ్యవహరిస్తున్న బూడి ముత్యాలనాయుడుపై మాడుగుల నియోజకవర్గంలో కావాల్సినంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. పదవి చేపట్టిన ఆరు నెలలకే ముత్యాల నాయుడును తొలగిస్తారనే పుకార్లు కూడా షికారు చేశాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు స్థానిక నేతలు. మరి గంటా మనసులో ఏముందో తెలియాలంటే… మరికొంత కాలం ఆగాల్సిందే.