నేనే హోమ్ మినిష్టర్…. రాసిపెట్టుకో.. సిగపట్లు పడుతున్న టీడీపీ నేతలు…!

నేనే హోమ్ మినిష్టర్… గెలుపు కూడా లాంఛనమే… కావాలంటే రాసి పెట్టుకో.. ఈ మాట అంటున్నది ఎవరో కాదు… టీడీపీలో ఇద్దరు కీలక నేతలు. ఆలు లేదు.. సూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఒకడు… అనేది పెద్దల మాట. ప్రస్తుతం ఈ మాట.. ఆ ఇద్దరు నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదండి… ఒకరేమో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు… మరొకరేమో… తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వీరిద్దరూ పొలిట్‌బ్యూరో సభ్యులే. వీరిద్దరు ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నేతలే. వీరిద్దరు ఒకేమాట చెబుతుండటంతో… పార్టీలో ఇతర నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. వాస్తవానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఈఎస్ఐ కుంభకోణం కేసులో ముందుగా అరెస్టైన నేత అచ్చెన్నాయుడు. ఆ తర్వాత కూడా అధికారులపై దురుసుగా ప్రవర్తించిన సందర్భం, పంచాయతీ ఎన్నికల సమయంలో అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన అచ్చెన్న.. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని… అప్పుడు తానే హోమ్ మంత్రి అని చెప్పేశారు. ఇప్పుడు తనను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ తాను గుర్తు పెట్టుకుంటా అని వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇక తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఈ సారి టీడీపీ అధికారంలోకి వస్తే.. ఎస్సీ మహిళ కోటాలో తానే హోమ్ మంత్రి అని బల్లగుద్ది మరి చెబుతున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని.. అలాగే తనపై సోషల్ మీడియాలో కూడా తప్పుడు వార్తలు రాస్తున్న వారిని వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు అనిత. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా రెండుసార్లు కూడా ఎస్సీ మహిళకే జగన్ అవకాశమిచ్చారని… టీడీపీ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు అదే చేస్తారని అనిత తన వర్గం నేతలకు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో అనిత వ్యతిరేక వర్గం మాత్రం… ముందు ఆమెకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో అనితకు కావాల్సినంత వ్యతిరేకత ఉన్న మాట బహిరంగ రహస్యం. అందుకే 2019 ఎన్నికల్లో అనితను కొవ్వూరు నుంచి బరిలోకి దింపారు చంద్రబాబు. అయితే ఈసారి మాత్రం పాయకరావుపేట ఇంఛార్జ్‌గా నియమించారు. కానీ అనితపైన ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో… రాబోయే ఎన్నికల్లో అనితను తప్పించి… మరొకరికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా… ఎన్నికలే రాలేదు.. పోటీ చేసేది లేనిది తెలియదు… గెలుస్తామో.. ఓడుతామో తెలియదు… కానీ ఇప్పటి నుంచే మంత్రిత్వ శాఖలు కూడా ఎంచుకోవడంపై సొంత పార్టీ నేతలే నోరెళ్లబెడుతున్నారు.