నిన్న మంచు ల‌క్ష్మి.. నేడు ఈషా రెబ్బా.. తెలుగు హీరోయిన్ల బాధ‌ కాస్త ప‌ట్టించుకోండి సామి!

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల‌ను చాలా చుల‌క‌న‌గా చూస్తుంటారు. దశాబ్దాల నుంచి ఇదే కొన‌సాగుతోంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా కొన‌సాగుతున్న ర‌ష్మిక, పూజా హెగ్డే, స‌మంత‌, అనుష్క‌, శ్రీ‌లీల వంటి వారంతా ఇత‌ర భాష‌ల నుంచి దిగ‌మ‌తి అయిన వారే. ఒక్క తెలుగు హీరోయిన్ కూడా టాలీవుడ్ లో టాప్ పొజీష‌న్ లో లేరంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోలేదు. స్టార్ హీరోలే కాదు టైర్ 2 హీరోల సినిమాల్లో కూడా తెలుగు హీరోయిన్ల‌కు అవ‌కాశాలు రావు.

ఈ విష‌యంపై తెలుగు హీరోయిన్లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వేద‌న‌ వ్య‌క్తం చేస్తూనే ఉంటాయి. నిన్న మంచు ల‌క్ష్మి కూడా తెలుగు హీరోయిన్ల‌కు ఏం త‌క్కువ అంటూ క‌డిగి పాడేసింది. ఇక నేడు ఈషా రెబ్బా కూడా టాలీవుడ్ పై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. `నేను ఇతర భాషా చిత్రాల్లో నటించినప్పుడు అక్కడి వాళ్లంతా తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అది నాకు ఎంతో గర్వంగా అనిపించేది.

అయితే మన దగ్గర మాత్రం పరభాషా హీరోయిన్ల‌నే ఎక్కువ‌ తీసుకుంటారు. తెలుగు తెలియని హీరోయిన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర భాషల కథానాయికలు మాత్రమే కావాలని ప్రేక్షకులు డిమాండ్‌ చేయరు కదా? అలాంటప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాదు. ప్రతిభ ఉన్న నటీనటులు తెలుగులో చాలా మంది ఉన్నారు. కానీ, వారికి మాత్రం అవ‌కాశాలు ద‌క్క‌డం లేదు` అంటూ ఈషా రెబ్బా వాపోయింది. కాగా, తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బాకు అందంతో పాటు మంచి ట్యాలెంట్ ఉన్నా.. టాలీవుడ్ లో ఆమెను స‌హాయ‌క పాత్ర‌ల‌కే ప‌రిమితం చేశారు. కానీ త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో హీరోయిన్ గా అవ‌కాశాలు రావ‌డంతో.. ఆయా భాష‌ల్లో స‌త్తా చాటుతోంది. ఈషా రెబ్బా మాత్ర‌మే కాదు దాదాపు తెలుగు హీరోయిన్లంద‌రి ప‌రిస్థితి ఇదే. ఇప్ప‌టికైనా తెలుగు హీరోయిన్ల బాధను టాలీవుడ్ ప‌ట్టించుకుంటుందా..లేదా.. అన్న‌ది చూడాలి.