జగన్‌తో అవినాష్ రెడ్డి భేటీ… కారణం…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి
ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి రిమాండ్ ఖైధీగా ఉన్నారు. ఇక అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. అలాగే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు కూడా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్‌లో పొందుపరిచారు సీబీఐ అధికారులు. అటు అవినాష్ రెడ్డి కూడా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందినప్పటికీ… సీబీఐ అధికారులు ఎప్పుడి పిలిస్తే అప్పుడు విచారణకు హాజరై వస్తున్నారు.

ఓ వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి నేరుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌తో అవినాష్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవానికి హత్య కేసులో సీబీఐ నుంచి సమన్లు అందుకున్న తర్వాత జగన్‌ను అవినాష్ రెడ్డి కలిసిన సందర్భాలు చాలా తక్కువ. సీఎం జగన్ కడప జిల్లా పర్యటనల్లో మినహా… మరెక్కడా వీరిద్దరు ప్రత్యేకంగా భేటీ జరిగినట్లు లేదు. చివరికి అవినాష్ రెడ్డి తల్లి గుండె పోటుతో ఆసుపత్రిలో చేరిన సమయంలో కూడా జగన్, అవినాష్ భేటీ జరగలేదు. అయితే సీబీఐ దర్యాప్తుపై ఇప్పటికే వైసీపీ కీలక నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి అయితే ఏకంగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ కూడా రాశారు. సీబీఐ దర్యాప్తుపై అనుమానాలున్నాయని లేఖలో అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ లేఖ రాసిన తర్వాత అవినాష్ రెడ్డి, జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ హత్యను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయించారని అప్పట్లో వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ కూడా జరిపించాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. తర్వాత ఈ హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. చివరికి వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉందని సీబీఐ ఆరోపిస్తోంది కూడా. దీంతో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్ సింగ్‌ను అవినాష్ రెడ్డి టార్గెట్ చేశారు. రామ్ సింగ్ హయాంలో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పక్కదారి పట్టిందని… కేవలం పక్షపాత వైఖరితోనే రామ్ సింగ్ కేసును దర్యాప్తు చేశారని ఆరోపించారు అవినాష్ రెడ్డి. హత్య వెనుక రెండో వివాహం, భూ లావాదేవీ వంటి అంశాలున్నాయని…. దర్యాప్తును పునః సమీక్షించాలని కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు రాసిన లేఖలో అవినాష్ ప్రస్తావించారు.