ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన పవన్… ఆ దిశగానే క్రమంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు సార్లు వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్… మూడోసారి కూడా పర్యటించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక అదే సమయంలో జగన్ సర్కార్‌ను అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను పవన్ ఉపయోగించుకుంటున్నాడు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల దుస్థితి అంటూ క్యాంపెయిన్ చేశారు. గుంతల రోడ్లపైన నాట్లు వేయడం, శ్రమదానం పేరుతో మరమ్మతులు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక తాజాగా వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించిన సమాచారాన్ని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని… మహిళల వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతుందని కూడా పవన్ ఆరోపించారు. ఇదే అంశంపై గత ఆదివారం సోషల్ మీడియా వేదికగా… మిస్టర్ వాట్సన్ అంటూ జగన్‌ను సంభోదించిన పవన్… మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ నిలదీశారు కూడా.
అలాగే బైజూస్ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో… విద్యా వ్యవస్థలో అవకతవకలు, బైజూస్ సంస్థతో లావాదేవీల్లో అవినీతి, ట్యాబ్‌ల కొనుగోలులో గోల్ మాల్ అంటూ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు గుప్పించారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త టాస్క్ మొదలుపెట్టేందుకు పవన్ రెడీ అయ్యారు. జగనన్న కాలనీల ముసుగులో ఏపీలో అతి పెద్ద కుంభకోణానికి తెర లేపారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని జనసేన పార్టీ కూడా టేకప్ చేసినట్లు ఉంది. సోషల్ మీడియా క్యాంపెయిన్ రూపంలో జననన్న కాలనీల కుంభకోణాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇదే అంశాన్ని జనసేన పార్టీ నేతలు వెల్లడించారు. వర్షాకాలంలో జగనన్న కాలనీల్లో చేరిన వరద నీరు, వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా వివరించాలని జనసేన నిర్ణయించింది. ఇదే విషయంపై రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి జనసేన నేతలు, వీర మహిళలు తమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు సందర్శించాలని… అక్కడి వాస్తవ పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా షేక్ చేయాలని జనసేన పార్టీ ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతంలో జగనన్న కాలనీల పేరుత జరిగిన అతి పెద్ద కుంభకోణాన్ని పవన్ బయటపెట్టారని… ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊర్లల్లో కూడా ఈ వ్యవహారాన్ని స్థానిక జనసేన నేతలు అవినీతిని వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించారు.
జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పేరిట రూ.89 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి కాలనీలో వీధి దీపాలు, రోడ్లు, పార్కులు, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోందని… అయితే అవన్నీ ఆచరణ సాధ్యం కాని మోసాలని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. చెరువుల్ని ఆక్రమించి.. ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అమ్మేసి వైసీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే శనివారం నుంచి ప్రతి జనసేన కార్యకర్త తమ ప్రాంతంలోని జగనన్న కాలనీల వాస్తవ పరిస్థితులను ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని మనోహర్ ఆదేశించారు.