పొంగులేటి-జూపల్లి రెడీ..కాంగ్రెస్‌కు లాభమెంత.?

ఎట్టకేలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయిపోయారు. చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఈ ఇద్దరి అంశం పెద్ద హాట్ టాపిక్ అయింది. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చాక వీరు ఎటువైపు వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే క్రమంలో వీరిని బి‌జే‌పిలోకి తీసుకురావడానికి ఈటల రాజేందర్ పలుమార్లు చర్చించారు. కానీ వారు మాత్రం బి‌జే‌పిలోకి వెళ్లడానికి ఒప్పుకోలేదు.

పైగా ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకురావాలని రివర్స్ లో ట్రై చేశారు. దీంతో ఈటల సైలెంట్ అయ్యారు. ఇక కాంగ్రెస్ లో చేరే విషయంలో కొన్ని రోజులు సస్పెన్స్ నడిచింది. పొంగులేటి, జూపల్లి తమ వర్గం నేతలకు సైతం సీట్లు ఇప్పించుకునేలా చర్చలు చేశారు. దీంతోనే కాస్త చేరిక ఆలస్యమైంది. కానీ తాజాగా వారిద్దరు క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ లో చేరే విషయం చెప్పేశారు. జూలై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ పెట్టి అప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిసింది.

కానీ దాని కంటే ముందు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఈ ఇద్దరితో భేటీ అయ్యి  చర్చలు జరపనున్నారు. అలాగే వీరు ఈ నెల 25న ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలవనున్నారు. ఆ తర్వాత రోజు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించి..రాష్ట్రానికి వచ్చి భారీ స్థాయిలో సభ పెట్టనున్నారు.

వీరితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు..పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు, ముగ్గురు జెడ్పీ చైర్మన్లు సియటం కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు సస్పెన్స్ లో పెట్టిన పొంగులేటి, జూపల్లి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉందా? అంటే కొంతమేర ఉంటుందనే చెప్పాలి. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొంత మేర ఓట్లు కలిసొస్తాయి. ఈ ఓట్లు గెలుపుకు సహకరిస్తాయా లేదా? అనేది చూడాలి.