18 మందికి సెగలు..45 మందికి మైనస్..జగన్ మార్చేస్తారా?

మళ్ళీ చాలా రోజుల తర్వాత గడపగడపకు కార్యక్రమంపై సి‌ఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు. ఎవరెవరు గడపగడపకు తిరుగుతున్నారో..వారి గురించి చెబుతూనే..తిరగని వారికి గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. కానీ సారి ఎమ్మెల్యేల పేర్లు మాత్రం బయటకు రానివ్వలేదు. అలాగే 99.5 శాతం హామీలు పూర్తి చేశామని, కాబట్టి మనకు 175 సీట్లు ఎందుకు రావని అన్నారు. త్వరలో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టనున్నారు.

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించడం, లబ్ది దారుల ఇళ్లకు వెళ్ళి వారి మద్ధతు పొందడమే లక్ష్యంగా గడపగడపకు ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు పెడుతూ..ఎమ్మెల్యేల పనితీరు గురించి సర్వేలు చేయించుకుని జగన్..పనితీరు బాగోని వారికి క్లాస్ పీకుతున్నారు. తాజాగా కూడా అదే చేశారు. 18 మంది అసలు గడపగడపకు వెళ్ళడం లేదట. కానీ వారి పేర్లు చెప్పకుండా.. వారి ఎవరో వారికే తెలుసని చెప్పుకొచ్చారు. వారికి అక్టోబర్ వారికి టైమ్ ఇస్తున్నానని, ఈలోపు పనితీరు మెరుగు పర్చుకోకపోతే నెక్స్ట్ సీటు ఇవ్వనని చెప్పారు.

అయితే మరీ దారుణంగా 18 మంది ఉంటే..దాదాపు 45 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలిసింది. వీరికి గెలుపు అవకాశాలు కూడా లేవని తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలకు ఈ సారి జగన్ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. అలాగే అక్టోబర్ వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం పెట్టనున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పడే పరిస్తితి లేదు. వారికి సీట్లు కూడా గ్యారెంటీ లేదని చెప్పవచ్చు.