ఆస్కార్‌లో కొత్త రూల్‌ షురూ అయింది.. ఈ అర్హతలు ఉంటేనే, లేదంటే నో ఎంట్రీ?

ఆస్కార్‌ సభ్యత్వ నమోదు అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆస్కార్‌ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్‌ అనేది కీలకంగా మారుతుంది. ఈ క్రమంలోనే 96వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్‌ ఆఫ్‌ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్‌ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్‌ కమిటీ సీఈవో బిల్‌ క్రామెర్, అధ్యక్షుడు జానెట్‌ యాంగ్‌ తాజాగా వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా తెలుగు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వంటివారు ఉండడం విశేషం.

ఇక అసలు విషయంలోకి వెళితే, వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్‌ ఆఫ్‌ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ తాజగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లు ఆస్కార్‌ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్‌ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్‌ చెబుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అదే విధంగా ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌లు కూడా ఆస్కార్‌ అకాడమీ సభ్యులు కానుండడం విశేషం.

అంతేకాకుండా దర్శకులు మణిరత్నం, షౌనక్‌ సేన్‌, నిర్మాతలు కరణ్‌ జోహర్, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, చైతన్య తమ్హానే (మరాఠీ), గిరీష్‌ బాలకృష్ణన్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆర్టిస్ట్‌లు హరేష్‌ హింగో రాణి, క్రాంతి శర్మ, పీసీ సనత్, ఫిల్మ్‌ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి స్పందిస్తూ… ”ఆస్కార్‌ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్‌ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్‌ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు” అని ట్వీట్‌ చేశారు.