బాబు గేమ్ ఛేంజర్ స్కీమ్..జగన్‌ని ఆపగలవా.!

వచ్చే ఎన్నికల్లో గెలుపుపై జగన్ ధీమాగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాలని చూసుకునే ఆయన గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. అవే వైసీపీని గట్టెక్కేస్తాయని భావిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారు.  అటు ప్రజలు సైతం పథకాలకు అలవాటు పడి ఉన్నారు. ఒకవేళ నెక్స్ట్ వచ్చేవారు వాటిని తీసేస్తే..ప్రజలు ఒప్పుకునే పరిస్తితి లేదు.

అందుకే చంద్రబాబు సైతం నెక్స్ట్ అధికారంలోకి రావడం కోసం అదే సంక్షేమాన్ని నమ్ముకున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే..మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో ఊహించని స్కీమ్స్ ప్రకటించారు. ప్రజలని ఆకట్టుకునే విధంగా పథకాలు రూపోదించారు. మహాశక్తి, యువగళం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం.. పేర్లతో కొత్త పథకాలను ప్రవేశపెడతానంటూ చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు.

ఈ క్రమంలో మహిళల కోసం ‘మహా శక్తి’ 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న మహిళలకు నెలకు రూ.1500. ఇంట్లో ఈ వయసు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ ‘నిధి’ ఇస్తామని అన్నారు. మహిళలు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించినా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు’ అనే నిబంధన తొలగింపు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం.

పేదవారిని జీవితాంతం పేదరికంలోనే ఉంచడం కాకుండా వారిని ధనికులను చేయడానికి పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ తరహాలో ప్రజల భాగస్వామ్యంతో నిర్దిష్ట కార్యక్రమం చేపట్టనున్నారు. ద్యోగం వచ్చేదాకా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి. పరిశ్రమలు, కంపెనీలు తేవడం ద్వారా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన. ఇంటింటికీ తాగునీటి కొళాయి కనెక్షన్‌. రైతు సాయం కింద అన్నదాత పథకం పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం తరహాలో బీసీ వర్గాల వారిపై దాడులు, అత్యాచారాల నిరోధానికి బీసీల రక్షణ చట్టం. ఇంట్లో చదువుకొనే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికీ ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహకం. ఇలా కీలక హామీలని చంద్రబాబు ప్రకటించారు. మరి ఇవి టీడీపీని అధికారంలోకి తీసుకొస్తాయేమో చూడాలి.