అనంతలో రేసు గుర్రాలు..టీడీపీకి కలిసోచ్చేనా!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సారి ఎక్కువ స్థానాలని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. 2014 ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఆ ఎన్నికల్లో 14 సీట్లకు 12 సీట్లు దక్కించుకుంది. కానీ 2019 ఎన్నికల్లో టి‌డి‌పికి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం భారీగా సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే జిల్లాలో టి‌డి‌పి నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు.

అలాగే లోకేష్ పాదయాత్ర సైతం టి‌డి‌పికి కొత్త ఊపు తీసుకొస్తుంది. అదే సమయంలో గతానికి భిన్నంగా ఎన్నికల కంటే ముందు గానే ఇక్కడ అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు చాలా మంది అభ్యర్ధులు ఫిక్స్ అయిపోయారు. ఎలాగో హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య మళ్ళీ బరిలో దిగనున్నారు. ఇటు ఉరవకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పోటీ చేయనున్నారు. ఇక రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని ఇటీవల లోకేష్ చెప్పేశారు.

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి లేదా ఆయన తనయుడు అస్మిత్ పోటీ చేస్తారు. పెనుకొండలో బీకే పార్థసారథి, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు, కళ్యాణదుర్గంలో ఉమా మహేశ్వరనాయుడు, శింగనమలలో బండారు శ్రావణి, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అనంత అర్బన్, గుంతకల్, మడకశిర లాంటి సీట్లలో క్లారిటీ లేదు.

అంటే జిల్లాలో చాలా సీట్లు ఫిక్స్ అయిపోయాయని చెప్పవచ్చు. కాస్త అటు ఇటు అయితే చివరి నిమిషంలో కొన్ని సీట్లలో మార్పు ఉండవచ్చు గాని..దాదాపు ఈ సీట్లు ఫిక్స్ అని చెప్పవచ్చు.