అసెంబ్లీ సీట్లలో ఎంపీలు..జగన్ ఛాన్స్ ఇస్తారా?

వచ్చే ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేనని జగన్ ఇప్పటికే చెప్పేసిన విషయం తెలిసిందే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అటు టి‌డి‌పి, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరందరికి మళ్ళీ సీట్లు ఇవ్వడం అనేది కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టం.

దీంతో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఎవరికైతే సీటు దక్కడం అనే డౌట్ ఉంటుందో..ఆ స్థానాల్లో నేతలు సీటు కోసం పోటీ పడటం ఎక్కువ అవుతుంది. ఇదే సమయంలో కొందరు ఎంపీలు..నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్…రాజమండ్రి సిటీ సీటులో పోటీ చేయాలని చూస్తున్నారు..అక్కడే ఆయన రాజకీయం చేస్తున్నారు. అది టి‌డి‌పి సిట్టింగ్ కావడంతో ..అక్కడ భరత్‌కు కాస్త ఛాన్స్ ఉంటుందనే చెప్పాలి.

అరకు ఎంపీ మాధవి సైతం…ఈ సారి అసెంబ్లీకి వెళ్లాలని చూస్తున్నారు. పాడేరులో పోటీ చేయాలని చూస్తున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది. ఇటు అమలాపురం ఎంపీ చింతా అనురాధా…ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. రాజోలు, పి.గన్నవరం, అమలాపురం..ఈ మూడిటిల్లో ఏదొక సీటులో పోటీ చేయాలని భావిస్తున్నారు.

విశాఖ ఎంపీ సత్యనారాయణ సైతం..విశాఖ తూర్పు అసెంబ్లీలో పోటీ చేయాలని చూస్తున్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్..నూజివీడు అసెంబ్లీపై కన్నేసినట్లు తెలుస్తోంది. అటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డి..నెల్లూరు రూరల్ సీటులో పోటీకి రెడీ అవుతున్నారు. హిందూపురం ఎంపీ మాధవ్..పత్తికొండ పై కన్నేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి..గూడూరు సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎంపీలు ఎమ్మెల్యే సీట్లపై ఫోకస్ పెట్టారు. మరి వీరిలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో.