విశాఖ స్టీల్‌పై కేసీఆర్ పోలిటికల్ గేమ్..!

జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్…ఏపీపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ ఆల్రెడీ పార్టీ శాఖని కూడా మొదలుపెట్టారు. తోట చంద్రశేఖర్‌ని అధ్యక్షుడుగా నియమించారు. ఇక ఆయన ఆధ్వర్యంలో ఏపీలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఏపీలో పోలిటికల్ మైలేజ్ పెంచుకునేందుకు కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, ఇటు జనసేన సైతం..కేంద్రంలోని బి‌జే‌పికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోవడం లేదు..సొంత రాజకీయ ప్రయోజనాలపైనే ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అమలు చేయాల్సిన విభజన హామీలని గాలికొదిలేశారు. అటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ఇప్పటికే ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు..అటు కమ్యూనిస్టులు పోరాటానికి మద్ధతు ఇస్తున్నారు. కానీ మిగిలిన పార్టీలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలోని బి‌ఆర్‌ఎస్ పార్టీ పోరాటం మొదలుపెట్టింది.

దీని ద్వారా రాజకీయంగా బెనిఫిట్ పొందాలనేది కే‌సి‌ఆర్ కాన్సెప్ట్…అదే సమయంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ని ప్రయివేటీకరణ దిశగానే తీసుకెళితే బిడ్డింగ్‌లో పాల్గొని, దాన్ని సొంతం చేసుకోవాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేశారు.

ఇప్పటికే బిడ్డింగ్ ఓపెన్ అయిపోయింది. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్‌ దాఖలు చేయవచ్చు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే సన్నాహాల్లో భాగంగా ఆర్‌ఐఎన్‌ఎల్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈవోఐని విడుదల చేయించిందని మంత్రి కేటీఆర్‌ సహా విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. కంపెనీలు మాత్రమే పాల్గొనాలి అవి కూడా బొగ్గు, ఇనుప ఖనిజం సరఫరా చేసే సంస్థల్లో బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని ఈవోఐ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. దీని ద్వారా విశాఖ స్టీల్‌ని సొంతం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. దీంతో అటు బి‌జే‌పికి చెక్ పెట్టినట్లు ఉంటుంది..ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకుండా ఆపి, ఏపీలో పోలిటికల్ మైలేజ్ దక్కించుకున్నట్లు ఉంటుందని భావిస్తున్నారు.