ప్రయోగాత్మక సినిమాలపై ఆసక్తి చూపని తెలుగు హీరోలు.. ఆ ఇండస్ట్రీలో పరిస్థితి భిన్నం..

తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా మన తెలుగు సినీ పరిశ్రమ పేరును అందరికీ చాటి చెప్పేలా చేసింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది. ఈ ఘనత నిస్సందేహంగా దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. అంతేకాకుండా మన భాషలో తీసిన సినిమాలపై ఇతర సినీ ఇండస్ట్రీల హీరోలు, దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.

రైట్స్ సంపాదించి వారి భాషల్లో సినిమాలు తీసి హిట్‌లు కొడుతున్నారు. అయినప్పటికీ మన హీరోలపై ఓ మచ్చ ఉంది. ప్రయోగాత్మక సినిమాల జోలికి మన హీరోలు పోవడం లేదనే విమర్శలున్నాయి. బాగా హీరోయిజం చూపించే సినిమాలు, అందులోనూ విలన్లను కత్తులతో నరకడం ఇవే బాగా హైలైట్ చేసి చూపిస్తున్నానే భావన ఉంది. ప్రయోగాత్మక చిత్రాల్లో స్టార్ హీరోలు నటించడం లేదని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.

మలయాళం సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అయిన మోహన్ లాల్, మమ్ముట్టిలు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగి పోతారు. పనివాడిగా, పాలు అమ్మే వాడిగా కూడా పాత్రలు వస్తే ఏ మాత్రం వెనుకంజ వేయరు. నేటికీ వైవిధ్యభరితమైన చిత్రాల్లో వారు కనిపిస్తున్నారు. మన సీనియర్ హీరోలు మాత్రం ప్రస్తుతం మూస ధోరణితో కూడిన సినిమాలే చేస్తున్నారని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. గతంలో చిరంజీవి రిక్షావాడిగా, కార్మికుడిగా, స్వయంకృషి సినిమాలో చెప్పులు కుట్టే వ్యక్తిగా కనిపించాడు. అయితే ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో సినీ హీరో వెంకటేష్ నారప్ప సినిమా చేశాడు. ఇది ఓటీటీలో విడుదలైనా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇది అనువాద చిత్రం. ముఖ్యంగా మలయాళ సినీ ఇండస్ట్రీలో కథ ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి.

అక్కడ విడుదలైన ఎన్నో సినిమాలను వివిధ సినీ ఇండస్ట్రీల హీరోలతో రీమేక్ అవుతున్నాయి. అయితే మన హీరోలు ఎవరికీ తక్కువ కాదు. మన దర్శకుల వద్ద కూడా చాలా ప్రతిభ ఉంది. అయితే ప్రయోగాలు చేయడంపైనే అంతా వెనుకంజ వేస్తున్నారనే భావన ఉంది. దీనిని రానున్న కాలంలో అయినా అధిగమించాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.