బాక్సాఫీసుకు 2022లో ఊపిరి పోసిన సినిమాలివే..

కరోనా మానవ జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా మహమ్మారి విజృంభించిన సమయంలో చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడ్డారు. ఎంతో మంది కుటుంబ సభ్యులను చివరి చూపు కూడా చూసుకోలేని పరిస్థితి. అయితే ఆ స్థితి నుంచి 2022లో కొంత ఉపశమనం లభించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్లు గణనీయమైన ప్రభావం చూపడంతో పరిస్థితి మారింది. వ్యాపారాలు పుంజుకున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి 2022 కొత్త ఊపిరి అందించింది. ఈ ఏడాది విడుదలైన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. నిర్మాతలకు ఊహించని రీతిలో లాభాలు తెచ్చిపెట్టాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

గతేడాది తెలుగు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.1200 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. మొత్తంగా అన్ని ఖర్చులూ తీసేసినా, నిర్మాతకు రూ.150 కోట్లకు పైగానే లాభాలు సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ముఖ్యంగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ-2 సినిమా హీరో నిఖిల్‌‌కు పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా నార్త్ లో ఊహించని విజయాన్ని అందించింది. బాక్సాఫీసు వద్ద చక్కని వసూళ్లు రాబట్టి నిర్మాతలకు రూ.45 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. ఇక క్లాసిక్ హిట్ సీతారామమ్ సినిమా ఎంతో మంది హృదయాలను కదిలించింది. ఈ సినిమాతో దుల్కర్-మృణాల్ జంటను తెలుగు వారు తమ వారుగా భావించారు.

ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి విజయాన్ని అందుకుంది. ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాకు రూ.29 కోట్ల లాభాలు వచ్చాయి. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బింబిసార సినిమా రూ.26 కోట్ల లాభాలను అందుకుంది. మహేష్ బాబు నిర్మాతగా, అడవి శేష్ హీరోగా వచ్చి ‘మేజర్’ సినిమాకు రూ.14 కోట్ల లాభాలు వచ్చాయి. డీజే టిల్లు సినిమాకు రూ.8 కోట్లు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. డబ్బింగ్ సినిమాలైన కేజీఎఫ్-2కి తెలుగులోనే రూ.30 కోట్లు, కాంతారాకు రూ.25 కోట్లు, విక్రమ్ సినిమాకు రూ.10 కోట్లు వరకు లాభాలు వచ్చాయి.