మళ్ళీ మైలవరం పంచాయితీ..జోగి టార్గెట్‌గా వసంత.!

మరోసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం వైసీపీలో పంచాయితీ మొదలైంది. ఇటీవలే జగన్ అంతా సర్ది చెప్పారని అనుకుంటే..ఈ లోపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజుల నుంచి మైలవరంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేష్ లకు పడని పరిస్తితి. రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వసంతని తప్పించి మైలవరం సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారని ప్రచారం ఉంది.

ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెడనలో గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి..దీంతో సొంత స్థానం మైలవరంకు మారాలని చూస్తున్నారు. అక్కడ వసంతకు తన వర్గం ద్వారా చెక్ పెట్టిస్తున్నారు. దీంతో వసంత కొన్ని రోజులు పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలో జగన్ కల్పించుకుని వసంతతో మాట్లాడారు. 30 ఏళ్ల పాటు తనతో కలిసి రాజకీయాల్లో ఉండాలని, వెళ్ళి మైలవరంలో పనిచేయాలని సూచించారు. అలాగే జోగికి క్లాస్ ఇచ్చారు. ఎవరు నియోజకవర్గంలో వారే ఉండాలని చెప్పారు. దీంతో మైలవరంలో వసంత మళ్ళీ యాక్టివ్ అయ్యి పనిచేసుకుంటున్నారు.

ఈ తరుణంలో వసంత…ఓ కార్యక్రమంలో పాల్గొని..జోగి వర్గం టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో స్వపక్షంలోనే విపక్షాలు తయారయ్యాయని, చడ్డీ గ్యాంగ్, బెల్ట్ బ్యాచ్,తొట్టి గ్యాంగ్‌లుగా మారిపోయారని, విపక్షాలకు మనల్ని విమర్శించే దైర్యం లేదని, కోతి మూకలు సొంత పార్టీలో చేసే చర్యల్ని పట్టించుకోవద్దని వైసీపీ శ్రేణులకు వసంత సూచించారు. అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇలా వసంత..జోగి వర్గంగా కామెంట్స్ చేయడంతో..జోగి వర్గం రగిలిపోతుంది..మళ్ళీ మైలవరంలో పెద్ద పంచాయితీ జరిగేలా ఉంది.