అన్నమయ్య సినిమాలో దేవుడి రోల్ కొద్దిలో మిస్ చేసుకున్న హీరోలు వీరే..

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన కెరీర్‏లో సూపర్ హిట్ అయిన చిత్రాలలో అన్నమయ్య సినిమా ఒకటి. 1997లో స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి ప్రధాన పాత్రలలో నటించారు. మోహన్ బాబు, రోజా, సుమన్, భానుప్రియ, శ్రీకన్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్ రావు కీలకపాత్రలలో కనిపించారు. ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు.

15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అన్నమయ్య పాత్రలో నాగార్జున నటించడం కాదు జీవించేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ ఆ శ్రీవారినే మైమరపించారు. ఇప్పటికీ ఈ సినిమా సినీ ప్రియులకు ఎవర్ గ్రీన్. వెంకటేశ్వర స్వామి పాత్ర అనగానే అందరికీ సుమన్ మాత్రమే గుర్తువస్తాడు.

అయితే శ్రీవారి పాత్ర కోసం మొదట సుమన్ ని మొదట ఎంపిక చేయలేదట. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి భక్తునిగా అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో వెంకటేశ్వర స్వామి పాదాలపై పడే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి స్వామి వారి పాత్రకు ఓ సీనియర్ హీరో అయితే బాగుంటుందని రాఘవేంద్రరావు అనుకున్నారట. అందుకే ఈ పాత్ర కోసం ముందుగా శోభన్ బాబును సంప్రదించారట. కానీ ఆయన ఈ పాత్ర చేసేందుకు నిరాకరించడంతో ఆ ఛాన్స్ బాలకృష్ణను చేరిందట.

అయితే బాలకృష్ణ ఒక స్టార్ హీరో, నాగర్జున ఒక స్టార్ హీరో. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోస్ ఇలాంటి పాత్రలలో నటిస్తే ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారో అనే భయంతో రాఘవేంద్రరావు వెనక్కి తగ్గారట. ఇక చివరకు వెంకటేశ్వర స్వామి పాత్రకు సుమన్ అయితే బాగుంటారని భావించి, ఆయనను కలిసి కథ వినిపించారట. కథ విన్న వెంటనే సుమన్ ఓకే చేశారట. అలా ఈ అద్భుతమైన అవకాశం సుమన్ సొంతం చేసుకున్నారు.