ఎలమంచిలి సీటుపై ట్విస్ట్..జనసేన కోసం టీడీపీ!

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున సీట్లలో ఎలమంచిలి కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది..1985 నుంచి 1999 వరకు వరుసగా టి‌డి‌పి గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో టి‌డి‌పి ఓడిపోయింది. వైసీపీ 4 వేల ఓట్ల మెజారిటీ తేడాతో గెలిచింది.

అయితే జనసేన ఓట్లు చీల్చడం వల్లే అక్కడ టి‌డి‌పికి ఓటమి ఎదురైందని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో జనసేనకు దాదాపు 20 వేల ఓట్ల వరకు పడ్డాయి. అదే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేసే ఉంటే ఫలితం వేరేగా ఉండేది. ఇక ఎన్నికల తర్వాత ఇక్కడ టి‌డి‌పికి ఎదురుదెబ్బ తగిలింది. టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పంచకర్ల రమేష్ బాబు..వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఎలమంచిలిలో టి‌డిపికి కాస్త రిస్క్ పెరిగింది. అదే సమయంలో ప్రగడ నాగేశ్వరరావుని టి‌డి‌పి ఇంచార్జ్ గా పెట్టారు. ఇక ఆయన తనకు సాధ్యమైన మేర పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.

అటు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. పైగా నెక్స్ట్ ఆయనకు సీటు ఇవ్వరనే ప్రచారం కూడా వస్తుంది. ఇప్పటికే ఆయన కూడా ఇస్తే తనకు లేదా, తన కుమారుడుకు సీటు ఇవ్వాలని అలా కాకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి ఎలమంచిలి సీటు ఇస్తే సహకరించేది లేదని అంటున్నారు. అంటే ఇక్కడ వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి.

అయితే టి‌డి‌పి సైతం అనుకున్న మేర బలపడటం లేదు. అటు జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో టి‌డి‌పితో పొత్తు ఉంటే ఈ సీటు జనసేన తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. కాకపోతే టి‌డి‌పికి ఇక్కడ బలం ఎక్కువ. మరి అలాంటప్పుడు ఈ సీటు జనసేన కోసం టి‌డి‌పి వదులుకుంటుందో లేదో చూడాలి.