టాలీవుడ్ డైలాగ్ కింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగారాయన. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ ఇలాంటి బిరుదులెన్నో సొంతం చేసుకున్నారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న మోహన్ బాబు 71 పుట్టిన రోజు నేడు.
ఈ సందర్భంగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆరు దశాబ్దాల సినీ కెరీర్ ను తాను ఎదుర్కొన్న కష్టాలు, చూసిన ఎత్తు పల్లాలు అందరితో పంచుకున్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే.. దాని వెనక ఎన్నో కష్టాలు, మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయని మోహన్ బాబు తెలిపారు.
`సినిమాల కోసం తాను చాలా కష్టపడ్డాను.. ఎలాటి ఇబ్బందులు ఫేస్ చేశానంటే.. ఒకానొక టైమ్ లో ఇబ్బందులు తట్టుకోలేక నా ఇల్లు కూడా అమ్ముకున్నాను. అప్పుడు ఏ ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. నా కష్టం మీదనే అన్ని సమస్యలు అధిగమించి మళ్లీ నిలబడ్డాను. అంతే కాదు నేను పడ్డ కష్టాలు.. నా పగవాడికి కూడా రాకూడదు అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అంటూ మోహన్ బాబు పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా తాను ప్రస్తుతం ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారు. దీంతో మోహన్ బాబు కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.