జగ్గంపేటలో జ్యోతుల జోష్..ఈ సారి వైసీపీకి చెక్!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జోష్ పెరుగుతుంది. వరుస ఓటములతో కుదలైన పార్టీకి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కొత్త ఊపుని తీసుకొస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగానే జ్యోతుల ముందుకెళుతున్నారు. అసలు జగ్గంపేటలో టి‌డి‌పి చివరిగా గెలిచింది 1999 ఎన్నికల్లోనే జ్యోతుల నెహ్రూ అప్పటిలో టి‌డి‌పి నుంచి వరుసగా గెలిచారు. 2004లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2009లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇటు జ్యోతుల మాత్రం ప్రజారాజ్యంలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లారు. ఇక 2014లో ఆయన వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత జ్యోతుల టి‌డి‌పిలోకి జంప్ చేశారు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబు పోటీ చేసి గెలిచారు. ఆ విధంగా ఓటమి పాలైన నెహ్రూ..నిదానంగా పార్టీని బలోపేతం చేసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. వైసీపీకి ధీటుగా టి‌డి‌పిని నిలబెడుతూ వస్తున్నారు.

ఇదే క్రమంలో పార్టీకి ఆధిక్యం పెరిగేలా చేశారు. ఇటీవల సర్వేల్లో జగ్గంపేటలో టి‌డి‌పికి గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టమయ్యాయి. ఇక ఈ ఊపుతో అక్కడ వైసీపీ నుంచి టి‌డి‌పిలోకి చేరికలు ఎక్కువయ్యాయి. తాజాగా కిర్లంపూడి మాజీ ఎంపీపీ కంచుమర్తి రాఘవ దంపతులు వైసీపీని వీడి నెహ్రూ సమక్షంలో టి‌డి‌పిలో చేరారు. ఇంకా పలువురు నేతలు టి‌డి‌పిలోకి వచ్చారు. దీంతో జగ్గంపేటలో టి‌డిపి బలం పెరుగుతుందనే చెప్పవచ్చు.