ఎమ్మెల్సీ ఆశ..వైసీపీలోకి జంపింగులు.!

ఏపీలో మరోసారి పదవుల పండుగ నడుస్తోంది. 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావాహులు వైసీపీ వైపు ఆశగా చూస్తున్నారు. 9 స్థానిక సంస్థల కోటాలో, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్థానిక సంస్థలో ఖాళీ ఉన్న 9 స్థానాలు డౌట్ లేకుండా వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైసీపీదే హవా ఉంది.

ఇక గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అయితే ఇలా భారీ స్థాయిలో ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో..ఇప్పటికే వైసీపీలో చాలామంది ఆశావాహులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల్లోని నేతలు పదవి కోసం వైసీపీలోకి జంపింగ్ మొదలుపెట్టారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. కైకలూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జయమంగళకు వచ్చే ఎన్నికల్లో సీటు దొరకడం డౌటే.

ఎందుకంటే కైకలూరు సీటుని పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పొత్తు లేకపోయినా ఆ సీటు మాత్రం జయమంగళకు ఇవ్వడం డౌటే అనే పరిస్తితి. ఆయన పనితీరు బాగోకపోవడం వల్ల సీటు దక్కే ఛాన్స్ లేదు. అందుకే జయమంగళ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. ఇక ఈయనకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని తెలిసింది.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కుడిపూడి సూర్యనారాయణ రావు.. వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల కోటాలో తూర్పు గోదావరి జిల్లా నుంచి అభ్యర్థిత్వాన్ని ఆయన ఆశిస్తోన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ సీటు కోసం వైసీపీలోకి జంపింగులు మొదలయ్యాయి.