మైలవరం పంచాయితీ: జోగికి షాక్ తప్పదా?

రాష్ట్రంలో పలు స్థానాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల సీట్ల కోసం ఫ్యాన్స్ మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరంలో కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రెండు వర్గాలు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మైలవరం పంచాయితీని జగన్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వసంతని పిలిపించి మాట్లాడారు. తాజాగా క్యాబినెట్ సమావేశం ముగిశాక జోగితో మాట్లాడినట్లు తెలిసింది. పైగా అంతకముందే పరిశీలకుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో వసంత-జోగి వర్గాలు కొట్టుకునే వరకు వెళ్ళాయి. దీంతో జగన్..జోగికి క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. పెడనకు చెందిన జోగిని..మైలవరంలో ఏం పని అని ప్రశ్నించినట్లు తెలిసింది.  ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని, ఇకపై అలాంటి చర్యలను సహించ బోనని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే జోగి సొంత స్థానం మైలవరం..2014లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జోగిని పెడన, మైలవరంలో వసంత నిలబడ్డారు. ఇద్దరు గెలిచారు. కానీ నెక్స్ట్ పెడనలో జోగి గెలవడం డౌట్ అనే పరిస్తితి. ఈ క్రమంలోనే మైలవరం సీటుపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అక్కడ తన అనుచరులతో వసంతకు చెక్ పెట్టేలా చేస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య పంచాయితీ మొదలైంది.

ఈ క్రమంలోనే వసంతకు నెక్స్ట్ సీటు లేదని, ఆయన టి‌డి‌పిలోకి జంప్ చేయవచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ ఎంట్రీ ఇచ్చి..జోగికి క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. మరి ఈ దెబ్బతో జోగి మైలవరం రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారా? లేదా? చూడాలి. ఇప్పటికైనా మైలవరం పంచాయితీ సర్దుకున్నట్లే ఏమో చూడాలి.