ఉదయగిరి వైసీపీలో పోరు..మేకపాటికి మైనస్!

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీలోని నేతలకు ఒకరంటే ఒకరికి పడని పరిస్తితి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలతో వెళ్ళడం, నేతలని, కార్యకర్తలని పట్టించుకోకపోవడం వల్ల వారు రివర్స్ అయ్యే పరిస్తితి నెలకొంది. ఇక ఇప్పటికే పలు వివాదాలు నడుస్తున్న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఆధిపత్య పోరు పెరిగింది.

ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎమ్మెల్యే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేయడం కాదు..సొంత పార్టీ వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్తితి. ఇదే క్రమంలో నియోజకవర్గంలో మేకపాటి వర్గానికి, మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గాల మధ్య చిచ్చు రేగింది. మొదట నుంచి ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగానే చేజర్ల ఉన్నారు. ఈయన సెపరేట్ గా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు అండగా కూడా ఉంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా..నూతన సంవత్సరం పురస్కరించుకుని చేజర్ల అభిమానులు నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో ఫ్లెక్షీలు కట్టారు. చేజర్ల యువసేన పేరుతో కట్టిన ఆ ఫ్లెక్సీలని మేకపాటి వర్గీయులు చించేసారని చేజర్ల వర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలా మేకపాటి, చేజర్ల వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. చేజర్ల మాత్రమే కాదు..ఉదయగిరిలో పలువురు వైసీపీ నేతలు మేకపాటికి వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు.

ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు మళ్ళీ సీటు ఇస్తే..సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకంగా పనిచేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీని వల్ల పరోక్షంగా వైసీపీకే నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.