గుడివాడలో తమ్ముళ్ళ ఐక్యత..ఎన్నికల్లో వర్కౌట్ చేస్తారా?

మొత్తానికి గుడివాడలో తెలుగు తమ్ముళ్ళు కాస్త కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం సీటు తమదంటే తమదని నేతలు ఎవరికి వారు సెపరేట్ గా రాజకీయం చేసుకుంటూ వచ్చారు. ఈ అంశం ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు ఇబ్బందిగా మారింది. పైగా రావి ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం నుంచి పెద్దలు గుడివాడ వెళ్ళి నేతలు కలిసి పనిచేయాలని సూచించారు.

కానీ వారు చెప్పినా సరే పెద్దగా తమ్ముళ్ళు కలిసినట్లు కనిపించలేదు. పైయగా ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము గుడివాడలో ఎంట్రీ ఇచ్చి టీడీపీలో యాక్టివ్ అయ్యారు. దీంతో ఆయనకే గుడివాడ సీటు అని ప్రచారం మొదలైంది. అయితే రాము మాత్రం సేవా కార్యక్రమాలు చేస్తూ..అందరూ నేతలని కలుపుకుని వెళుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావి, పిన్నమనేని బాబ్జీ, రాము, పిన్నమనేని వెంకటేశ్వరావు..వీరంతా కలిసి పాల్గొన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గుడివాడకు వచ్చి..వారి సమక్షంలోనే అన్నా క్యాంటీన్‌ని ప్రారంభించారు.

అయితే ఇలా నేతలు ఐక్యంగా ఉంటూ..ఎలాగైనా కొడాలి నానికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. కానీ ఐక్యత ఎన్నికల వరకు ఉంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ఇక సీటు విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు. చంద్రబాబు..గుడివాడ సీటుని రావికి ఫిక్స్ చేస్తారా? అనేది కూడా తెలియని పరిస్తితి. లేక వేరే వారికి సీటు ఇస్తారో కూడా క్లారిటీ లేదు.

కాకపోతే ఇక్కడ రావికే సీటు ఇవ్వాలనే డిమాండ్ స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి వస్తుంది. ఇప్పటికే పలుమార్లు సీటు త్యాగం చేశారు. ఇప్పుడు పార్టీ కోసం దూకుడుగా పనిచేస్తున్నారు. మరి చూడాలి చివరికి రావికి సీటు దక్కుతుందో లేదో.